కరోనా వైరస్ వైరస్.. ఏ ఒక్క రంగాన్ని వదిలిపెట్టడం లేదు. కోళ్ళ పరిశ్రమ నుంచి ఐటీ సెక్టార్ వరకు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందన్న విస్తృత ప్రచారంతో పౌల్ట్రీ పరిశ్రమ కోలుకోలేని విధంగా నష్టపోయింది. ఇపుడు ఐటీ రంగం కూడా కరోనా దెబ్బకు కుదేలైపోతోంది. తాజాగా గూగుల్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. దీంతో గూగుల్ ఉద్యోగులంతా ఇంటి నుంచి పని చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు.
బెంగళూరు నగరంలో గూగుల్ కార్యాలయం ఉంది. ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగుల్లో ఒకరికి కరోనా వైరస్ వచ్చిందని శుక్రవారం ఉదయం నిర్ధారణ అయింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా బెంగళూరు గూగుల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను శుక్రవారం ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
'శుక్రవారం బెంగళూరులోని మా గూగుల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించాం. ముందు జాగ్రత్త చర్యగా మా ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయాలని కోరాం' అని గూగుల్ యాజమాన్యం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
కరోనా వైరస్ సోకిన ఉద్యోగితో సన్నిహితంగా మెలిగిన ఉద్యోగులను కూడా క్వారంటైన్ చేశామని, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని గూగుల్ తెలిపింది. ప్రజారోగ్యం దృష్ట్యా తాము ఇంటి నుంచే పనిచేయాలని తమ ఉద్యోగులను ఆదేశించామని గూగుల్ వివరించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 73కు చేరింది.