సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ వివాదాస్పదమవుతుంది. తాజాగా తమ కొత్త ప్రైవసీ పాలసీ విధానాన్ని వాయిదా వేయలేమని మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టు వేదికగా స్పష్టం చేసింది.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాట్సాప్ తరఫున ఢిల్లీ హైకోర్టులో సోమవారం వాదనలు వినిపించారు. తమ కొత్త ప్రైవసీ పాలసీ విధానాన్ని అంగీకరించని వారి ఖాతాలను దశల వారీగా తొలగిస్తామని తెలిపారు. ఈ విధానాన్ని వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు.
తమ నూతన పాలసీ ఐటీ నిబంధనలను అతిక్రమించట్లేదని.. నిబంధనలకు లోబడి మాత్రమే ఈ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు సిబల్ కోర్టుకు చెప్పారు. ఈ కొత్త విధానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్(2000) లోని కొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టుకు చెప్పారు.
ఈ కొత్త పాలసీపై వాట్సాప్ ఉన్నతాధికారులకు కేంద్రం లేఖ రాసిందని, సమాధానం కోసం వేచిచూస్తున్నామని తెలిపారు. కాగా, వాట్సాప్ యథాతధ స్థితిని కొనసాగించాలని చేతన్ శర్మ, పిటీషనర్లు కోరగా.. హైకోర్టు నిరాకరించి విచారణను జూన్ 3కి వాయిదా వేసింది.