Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిజంగా సన్ రైజర్సే.. తొలి బోణీ అదిరింది.

సొంతగడ్డపై అంచనాలను నిలబెట్టుకుంటూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అద్భుత విజయంతో లీగ్‌లో తొలి అడుగును విజయవంతంగా వేసింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బలహీన బౌలింగ్‌ను సొమ్ము చేసుకుంటూ ముందుగా భార

Advertiesment
IPL-10
హైదరాబాద్ , గురువారం, 6 ఏప్రియల్ 2017 (02:40 IST)
డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయంతో సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. సొంతగడ్డపై అంచనాలను నిలబెట్టుకుంటూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అద్భుత విజయంతో లీగ్‌లో తొలి అడుగును విజయవంతంగా వేసింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బలహీన బౌలింగ్‌ను సొమ్ము చేసుకుంటూ ముందుగా భారీ స్కోరుతో చెలరేగిన సన్‌రైజర్స్‌ ఆ తర్వాత పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కుప్పకూల్చింది. ఐపీఎల్‌లో చాన్నాళ్ల తర్వాత యువరాజ్‌ సింగ్‌ వీరత్వం ప్రదర్శించి రైజర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం
.  
 
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విశేషంగా రాణించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఐపీఎల్‌–2017ను విజయంతో మొదలు పెట్టింది. తొలి మ్యాచ్‌లో గత ఏడాది రన్నరప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై హైదరాబాద్‌ 35 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 19.4 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. దీంతో హైదరాబాద్‌ 35 పరుగుల తేడాతో గెలుపొంది సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. 
 
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు క్రిస్‌గేల్‌(32), మన్‌దీప్‌ సింగ్‌(24) మంచి శుభారంభం అందించారు. అయితే వీరిద్దరూ నిలకడగా ఆడలేకపోయారు. తర్వాత వచ్చిన ట్రావిస్‌ హెడ్‌, కేదార్‌ జాదవ్‌, వాట్సన్‌ చెప్పుకోదగ్గ స్కోరు చేసినప్పటికీ భారీ స్కోరుగా మలచలేకపోయారు. దీంతో బెంగళూరు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. హైదరాబాద్‌ బౌలర్లలో ఆశీష్‌ నెహ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌ తలో రెండు వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. 
 
భారత స్టార్‌ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌, హెన్రిక్స్‌ చెలరేగడంతో హైదరాబాద్‌ భారీ స్కోరు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సర్లు బాదారు. ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్లను అడ్డుకోవడానికి బెంగళూరు ఏకంగా ఏడుగురు ఆటగాళ్లతో బౌలింగ్‌ వేయించింది. అయినప్పటికీ ఏ ఒక్కరూ హైదరాబాద్‌ ఆటగాళ్ల దూకుడును అడ్డుకోలేకపోయారు. తైమల్‌ మిల్స్‌, అనికేత్‌ చౌదరి, స్టువర్ట్‌ బిన్నీ తలో వికెట్‌ తీశారు
 
ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో విరగబాదిన యువరాజ్‌ సింగ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈనెల 9న హైదరాబాద్‌లోనే జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌ లయన్స్‌తో సన్‌రైజర్స్‌ ఆడుతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్పల్‌లో ఉతుకుడు... 27 బంతుల్లో యూవీ 62, RCB లక్ష్యం 208