చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ 2022లో చుక్కెదురైంది. చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 151పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లు పట్టుదలతో పోరాడారు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (59పరుగులు 44 బంతుల్లో 8ఫోర్లు 1సిక్సర్) రాణించడంతో పాటు చివర్లో రవిచంద్రన్ అశ్విన్ (40పరుగులు 23బంతుల్లో 2ఫోర్లు 3సిక్సర్లు నాటౌట్) వీరోచితంగా పోరాడి రాజస్థాన్‌ను 5వికెట్ల తేడాతో గెలిపించాడు.
రియాన్ పరాగ్(10)తో కలిసి అశ్విన్ రాజస్థాన్‌ను విజయతీరాలకు అద్భుతంగా చేర్చాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అశ్విన్ సొంతమైంది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 18పాయింట్లతో 2వ స్థానంతో పాటు టాప్ 2బెర్త్ ఖాయం చేసుకుంది.
దీంతో క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ తలపడనుంది. ఇక చెన్నై బౌలర్లు సైతం చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినప్పటికీ అశ్విన్ చివర్లో చెలరేగి చెన్నై విజయవకాశాలపై నీళ్లు చల్లాడు. చెన్నై బౌలర్లలో సిమ్రాన్ జిత్ సింగ్ 1, మొయిన్ అలీ 1, సాంట్నర్ 1, ప్రశాంత్ సోలంకి 2 వికెట్లు తీశారు.
మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈ ఐపీఎల్ 2022 సీజన్‌లో తన చిట్టచివరి మ్యాచ్‌లో తలపడగా.. టాస్ గెలిచిన ధోనీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో నిర్ణీత 20ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ 6వికెట్లు కోల్పోయి 150పరుగులు చేసింది. తద్వారా రాజస్థాన్‌కు 151పరుగుల టార్గెట్ విధించింది.
చెన్నై బ్యాటర్లలో మొయిన్ అలీ (93పరుగులు 57బంతుల్లో 13ఫోర్లు, 3సిక్సర్లు) వీరవిహారం చేశాడు. కానీ మిగతా బ్యాట్స్ మెన్ నుంచి అంతగా సపోర్ట్ లేకపోవడంతో చెన్నై తక్కువ స్కోరుకే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, అశ్విన్ తలా ఒక వికెట్ తీయగా, మెక్ కాయ్, చాహల్ తలా రెండు వికెట్లు తీశారు.