భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సమకాలీన క్రికెట్‌లో మేటి ఆటగాడు. ఫార్మాట్ ఏదైనా తన ముద్ర చూపిస్తూ దూసుకుపోయే పరుగుల వేటగాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా తనదైన శైలిలో జట్టును నడిపిస్తూ మెప్పిస్తున్నాడు. ఈ ఏడాది ట్రోఫీ నెగ్గాలన్న కసితో పరుగుల దాహం పెంచుకుని ఆరు వేల పరుగుల మైలురాయి దాటాడు ఈ ఛేదన రారాజు. ఈ రికార్డు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
కింగ్ కోహ్లీని మరెవరైనా దాటాలంటే మరో ఐపీఎల్ ఆడితేగానీ సాధ్యపడదేమో. అది కూడా.. ఆ ఐపీఎల్‌లో విరాట్ ఆడకపోతే! రెండో స్థానంలో ఉన్న సురేశ్ రైనా 5448 పరుగులతో కొనసాగుతున్నాడు. తర్వాత ధావన్ 5428, వార్నర్ 5384 పరుగులతో ఉన్నారు. ఇప్పటికే 196 ఐపీఎల్ మ్యాచులు పూర్తి చేసుకున్న కోహ్లీ త్వరలోనే 200 మ్యాచులాడినవారి జాబితాలో చేరనున్నాడు.
నిలకడకు మారుపేరైన కోహ్లీ ఐపీఎల్ సీజన్లన్నింటిలో కలిపి 5 సెంచరీలు బాదాడు. కోహ్లీ కన్నా ముందు ఒకటో స్థానంలో గేల్ 6 సెంచరీలతో ఉన్నాడు. 500 బౌండరీల క్లబ్‌లో ధావన్, వార్నర్‌ల తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే గేల్, డివిలియర్స్, రోహిత్, పొలార్డ్‌ల తర్వాత 200 సిక్సర్లు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు.
విరాట్ ఆడిన తొలి ఐపీఎల్‌లో కేవలం 165 పరుగులే చేశాడు. సగటు 15. ఆ తర్వాత సీజన్ల నుంచి రెచ్చిపోయాడు. విరాట్ కోహ్లీ చివరి నాలుగు ఓవర్లలో బ్యాటింగ్ స్ట్రైక్‌రేట్ 205.5 శాతం. విరాట్ విధ్వంసం కూడా కళాత్మకంగానే ఉంటుంది. మొదటి నుంచి బెంగళూరు జట్టుతోనే ఉన్న కోహ్లీ 2013 నుంచి నాయకుడిగా కొనసాగుతున్నాడు. ట్రోఫీని ముద్దాడాలనే కల ఈ ఏడాది తీరాలని అభిమానులు కోరుకుంటున్నారు.