రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచింది. నరాలు తెగే ఉత్కంఠ. చివరి బంతి వరకు విజేత ఎవరో తెలియని పరిస్థితి. సోమవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఇలాగే సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 200కు పైగా పరుగులతో భారీ స్కోర్ నెలకొల్పినా రాజస్థాన్ చివరి బంతి వరకు పోరాడింది.
ప్రధానంగా ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ (119: 63 బంతుల్లో.. 12 ఫోర్లు, 7 సిక్సులు) ఒంటరి పోరాటం చేసిన తీరు అభిమానులను కట్టిపడేసింది. శాంసన్ సెంచరీతో అదరగొట్టినా మిగతా బ్యాట్స్‌మన్ రాణించకపోవడంతో రాజస్థాన్‌కు ఓటమి పాలైంది.
222 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ప్రారంభంలోనే భారీ దెబ్బ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే డేంజరస్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ ను (0) మహ్మద్ షమి అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శాంసన్.. మనన్ వోహ్రా(14)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. కానీ.. నాలుగో ఓవర్‌లో వోహ్రా అవుట్ కావడంతో శాంసన్‌పై ఒత్తిడి పెరిగింది.
అయితే వోహ్రా తరువాత క్రీజులోకొచ్చిన జోస్ బట్లర్ ధాటిగా ఆడి.. 13 బంతుల్లోనే 25 పరుగులు చేసి ఊపుమీద కనిపించాడు. కానీ అతడిని అరంగేట్ర ఆటగాడు జ్యే రిచర్డ్‌సన్ బౌల్డ్ చేయడంతో రాజస్థాన్ కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తరువాత శివమ్ దూబే(23: 15 బంతుల్లో 3 ఫోర్లు), ర్యాన్ పరాగ్ (25: 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు) కూడా రెండు, మూడు బౌండరీలు బాది వెళ్లిపోయారే కానీ, శాంసన్‌కు పూర్తి సహకారం అందించలేకపోయారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది.
ఇక మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. టోర్నీలోనే తొలిసారి 200కు పైగా స్కోరు చేసి రికార్డు సృష్టించింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(91: 50 బంతుల్లో.. 7 ఫోర్లు, 5 సిక్సులు) అదరగొట్టాడు.
అతడికి క్రిస్ గేల్ (40: 28 బంతుల్లో.. 4 ఫోర్లు, 6 సిక్సులు)లకు తోడు దీపక్ హుడా(64: 28 బంతుల్లో.. 4 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో పంజాబ్ స్కోరు బోర్డు మ్యాచ్ ప్రారంభం నుంచే పరుగులు పెట్టింది. రాజస్థాన్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ రాహుల్, హుడాలు బౌండరీల వర్షం కురిపించారు. వీరిద్దరి విజృంభణతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.