Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 14 : ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్న ముంబై

ఐపీఎల్ 14 : ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్న ముంబై
, బుధవారం, 29 సెప్టెంబరు 2021 (08:23 IST)
ఐపీఎల్ 14వ సీజన్‌ పోటీల్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఎట్టకేలకు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడి ప్లే ఆఫ్స్ ఆశలను క్లిష్టతరం చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఎట్టకేలకు ఓ విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. 
 
గత రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత తడబడినా సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా చెలరేగడంతో పంజాబ్ ఓటమి ఖాయమైంది. ముంబైకి ఇది ఐదో విజయం కాగా, ఏడింటిలో ఓడిన పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఆటగాళ్లు తీవ్ర నిరాశపరిచారు. క్రిస్ గేల్ మరోమారు తీవ్రంగా నిరాశపరచగా మార్కరమ్ (42), దీపక్ హుడా (28), కెప్టెన్ కేఎల్ రాహుల్ (21) రాణించడంతో ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పొలార్డ్, బుమ్రా చెరో రెండు వికెట్లు తీసుకోగా, రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు.
 
ఆ తర్వాత 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై స్వల్ప లక్ష్య ఛేదనలో తొలుత తడబడింది. 61 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి మరో ఓటమి దిశగా పయనిస్తున్నట్టు కనిపించింది. అయితే, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా చెలరేగి జట్టును విజయం దిశగా నడిపారు. 
 
తివారీ 37 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 45 పరుగులు చేయగా, పాండ్యా 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 40 పరుగులు చేశాడు. తివారీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్ 7 బంతుల్లో సిక్సర్, ఫోర్‌తో 15 పరుగులు చేసి మిగతా పనిని పూర్తి చేశాడు. 
 
ఫలితంగా మరో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. బంతితోను, బ్యాట్‌తోనూ మెరిసిన పొలార్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా, షమీ, నాథన్ ఎల్లిస్ చెరో వికెట్ తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ జట్టును ఊరటనిచ్చే గెలుపు - ఆర్ఆర్ ఓటమి