ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ పోటీలు దుబాయ్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ విజయభేరీ మోగించింది.
నిజానికి ఈ మ్యాచ్‌లో 24 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన దశ నుంచి అనూహ్యంగా పుంజుకుని సత్తా చాటింది. రుతురాజ్ గైక్వాడ్ (88 నాటౌట్) అద్భుత ఆటతీరుకు తోడు చివర్లో రవీంద్ర జడేజా (26), బ్రావో (23 ) కాసేపు కుదురుకోవడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పరమ చెత్తగా ఆడారు. డుప్లెసిస్, మొయీన్ అలీ డకౌట్ కాగా, రాయుడు పరుగులేమీ చేయకుండానే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఓపెనర్ రుతురాజ్ మాత్రం అద్భుత పోరాటపటిమ కనబరిచాడు.
సహచరులు ఒక్కొక్కరు వెనుదిరుగుతున్నా అతడు మాత్రం క్రీజులో పాతుకుపోయి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింతగా చెలరేగి ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మొత్తం 58 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ 9 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 88 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్, మిల్నే, బుమ్రా చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు.
ఆ తర్వా 157 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. సౌరభ్ తివారీ 40 బంతుల్లో 5 ఫోర్లతో అర్థ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
బ్రావో, దీపక్ చాహర్ దెబ్బకు ముంబై 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డికాక్ (17), అన్మోల్‌ప్రీత్ సింగ్ (16), సూర్యకుమార్ యాదవ్ (3), ఇషాన్ కిషన్ (11) క్రీజులో కుదురుకోలేకపోయారు.
మరోవైపు, చెన్నై బౌలర్లు మరింతగా ఒత్తిడి పెంచడంతో పరుగులు రావడం కష్టమైంది. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ కీరన్ పొలార్డ్ కూడా 15 పరుగులకే వెనుదిరగడంతో ముంబై ఓటమి ఖాయమైంది. మిల్నే 15 పరుగులు చేశాడు.
చెన్నై బౌలర్లలో బ్రావో 3, చాహర్ రెండు వికెట్లు తీసుకోగా, హాజిల్‌వుడ్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. అజేయంగా 88 పరుగులు చేసి చెన్నై విజయానికి కారణమైన రుతురాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో భాగంగా నేడు కోల్‌కతా, బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది.