కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్‌ను పున: ప్రారంభించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం వాయిదా పడిన ఐపీఎల్ 2021ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లు జరగనున్నట్లు తెలుస్తోంది.
గతేడాది నిర్వహించిన వేదికల్లోనే మిగిలిన 31 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. దుబాయ్, అబుదాబీ, షార్జా స్టేడియంలలో బయోబబుల్ వాతావరణంలో లీగ్‌ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. కాగా, ఐపీఎల్ సెకండాఫ్‌కు ఆసీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు సమాచారం.
మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లు యూఏఈలో జరిగితే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి అవుతుంది. అంతకుముందు 2014 లో భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా లీగ్‌లో మొదటి 20 మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది. అదేవిధంగా, భారత్ లో కరోనా కారణంగా 2020 సీజన్ పూర్తిగా యూఏఈలో జరిగింది. గత సీజన్‌లో దుబాయ్, అబుదాబి, షార్జాతో సహా 3 స్టేడియంలో 60 మ్యాచ్‌లు జరిగాయి.
ఇది యూఏఈకి కూడా మంచి ఆదాయాన్ని ఆర్జించింది. ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బదులుగా బిసీసీఐ గత ఏడాది 98.5 కోట్ల రూపాయలను అరబ్ క్రికెట్ బోర్డుకు ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు 31మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం యూఏఈకి పెద్ద విషయం కాదు.