స్వదేశంలో ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చింది. దీంతో అనేక మంది విదేశీ ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఇప్పటికే టోర్నీ నుంచి తమతమ స్వదేశాలకు వెళ్లిపోయారు. అయితే, ఆస్ట్రేలియా వంటి ఆటగాళ్లు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌ను నడపాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు విజ్ఞప్తి చేశారు.
ఈ పరిస్థితులపై బీసీసీఐ స్పందించింది. ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లను టోర్నీ ముగియగానే వారి దేశాలకు జాగ్రత్తగా పంపించేందుకు తాము చేయాల్సినవన్నీ చేస్తామని మంగళవారం హామీ ఇచ్చింది. ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించిన నేపథ్యంలో బోర్డు ఈ ప్రకటన చేసింది.
ఇప్పటికే ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ లీగ్ నుంచి వెళ్లిపోవడం, మిగతా వాళ్లు కూడా ఆందోళనలో ఉన్న పరిస్థితుల్లో ఆటగాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. టోర్నీ ముగిసిన తర్వాత ఎలా వెళ్లాలన్న ఆందోళన మీలో ఉన్నట్లు మాకు అర్థమైంది. దీని గురించి మీరు ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు అని బీసీసీఐ సీఓఓ హేమంగ్ అమిన్ ఆటగాళ్లకు రాసిన లేఖలో చెప్పారు.
ఎలాంటి అడ్డంకులు లేకుండా మిమ్మల్ని మీ దేశాలకు పంపించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందని కూడా ఆయన తెలిపారు. మీలో ప్రతి ఒక్కరూ మీ ఇంటికి సురక్షితంగా చేరే వరకు మాకు టోర్నమెంట్ ముగిసినట్లు కాదు అని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికీ మీరు ఫీల్డ్‌లో అడుగు పెట్టినప్పుడు కొన్ని కోట్ల మంది మొహాల్లో చిరునవ్వును తీసుకొస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజల దృష్టిని మరల్చేందుకు మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషం పాటైనా ఎవరి మోములో అయినా చిరునవ్వు తీసుకురాగలిగితే మీరు మంచి పని చేసినట్లే. ఈసారి ఆడటం, గెలవడమే కాదు మరింత ముఖ్యమైన పని మీరు చేస్తున్నారు అని ఆటగాళ్లలో మానసిక స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.