ఐపీఎల్ టోర్నీలోభాగంగా, ఆదివారం మధ్యాహ్నం జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఆ జట్టు ఆటగాడు పరాగ్ భారీ సిక్సర్‌తో జట్టును గెలిపించాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భంగపాటు తప్పదలేదు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో రాజస్థాన్ జట్టు 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఆటగాళ్లు క్యాచ్‌లు వదలడం రాయల్స్‌కు లాభించింది.
రాజస్థాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెన్‌స్టోక్స్(5), జోస్ బట్లర్(16), స్టీవ్ స్మిత్(5), శాంసన్(26), రాబిన్ ఉతప్ప(18) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ దశలో క్రీజులో ఉన్న పరాగ్ - తెవాటియా జోడీ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో చెలరేగారు.
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న పరాగ్, తెవాటియా భారీ షాట్లతో సన్ రైజర్స్ అవకాశాలకు తెరదించారు. పరాగ్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేయగా, తెవాటియా 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేశాడు.
ముఖ్యంగా చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు కావాల్సి ఉండగా, ఆ ఓవర్ ఐదో బంతికి పరాగ్ సిక్స్ కొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం ఖాయమైంది. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్‌ను ఓడించింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు మనీశ్ పాండే 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో (53 రన్స్) అద్భుత అర్థ సెంచరీకి తోడు డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు 48 పరుగులతో) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (22నాటౌట్: 12 బంతుల్లో 2సిక్సర్లు) విజృంభించడంతో సన్‌రైజర్స్ సాధారణ స్కోరు చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, కార్తీక్ త్యాగీ, ఉనద్కత్ తలో వికెట్ పడగొట్టారు.