Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

ఐపీఎల్ 2020 : హైదరాబాద్‌ను తిప్పేసిన చాహల్.. బెంగుళూరుదే గెలుపు

Advertiesment
IPL 2020
, మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (09:10 IST)
ఐపీఎల్ 2020 టోర్నీలోభాగంగా సోమవారం రాత్రి సమఉజ్జీల పోరు సాగింది. దుబాయ్ వేదికగా జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో బెంగుళూరు జట్టు పది పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్, డివిలియర్స్ చెలరేగి ఆడారు. పడిక్కల్ 42 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేయగా, డివిలియర్స్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. ఫించ్ 29 పరుగులు చేశాడు. కోహ్లీ 14 పరుగులకే అవుటై నిరాశ పరచగా, శివం దూబే 7, ఫిలిప్ ఒక పరుగు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.
 
ఆ తర్వాత 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్.. ఆర్సీబీ బౌలర్లకు ఎదురొడ్డలేకపోయింది. ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్ హైదరాబాద్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. దీంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 153 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆరు పరుగులకే దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో క్రీజులో ఉన్నంత సేపు ఆశలు రేపాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
 
జట్టును విజయం వైపుగా తీసుకెళ్తున్నట్టు కనిపించిన బెయిర్‌స్టోను చాహల్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది. 43 బంతులు ఆడిన బెయిర్‌స్టో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన మనీష్ పాండేను కూడా చాహల్ పెవిలియన్ పంపాడు. 33 బంతులు ఆడిన పాండే సిక్సర్, 3 ఫోర్లతో 34 పరుగులు చేశాడు.
 
పాండే అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన ఎవరూ నిలదొక్కుకోలేక పోయారు. ముఖ్యంగా, రెండంకెల స్కోరు చేయలేక వికెట్లు సమర్పించుకున్నారు. ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. అతడి వికెట్ కూడా చాహల్ ఖాతాలోకే చేరింది. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసిన హైదరాబాద్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్ అయింది. 153 పరుగులు మాత్రమే చేసి విజయానికి మరో 11 పరుగులు ముందే చతికిల పడింది.
 
ఆర్సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ అద్భుత స్పెల్‌తో అదరగొట్టాడు. నాలుగు ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. నవ్‌దీప్ సైనీ, శివం దూబే చెరో రెండు వికెట్లు తీసుకోగా, డేల్ స్టెయిన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన చాహల్‌కు 'మ్యాన్ ఆఫ్ మ్యాచ్' దక్కింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు షార్జా వేదికగా తలపడనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెత్త అంపైరింగ్‌ వల్ల ఓడిపోయాం : ప్రీతి జింటా మండిపాటు