Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2020 : ఆధిపత్య పోరులో చతికిలపడిన కోహ్లీ సేన... అగ్రస్థానంలో ఢిల్లీ!

ఐపీఎల్ 2020 : ఆధిపత్య పోరులో చతికిలపడిన కోహ్లీ సేన... అగ్రస్థానంలో ఢిల్లీ!
, మంగళవారం, 6 అక్టోబరు 2020 (08:22 IST)
యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో భాగంగా, సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగుళూరు జట్టు చతికిలపడింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానం కోసం ఈ ఇరు జట్లూ తలపడగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 159 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. తద్వారా మొత్తం నాలుగు విజయాలతో ఢిల్లీ జట్టు ఎనిమిది పాయింట్లను తన ఖాతాలో వేసుకుని అగ్రస్థానంలో కొనసాగుతోంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ స్టాయినీస్‌(53 నాటౌట్‌:  26 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్థశతకంతో చెలరేగగా ఓపెనర్లు పృధ్వీషా 42, శిఖర్ ధావన్ 32లు బలమైన పునాది వేశారు. ఆ తర్వాత రిషబ్‌ పంత్‌ (37:25 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) రాణించాడు. చివర్లో స్టాయినీస్‌ ఎప్పటిలాగే వీరవిహారం చేశాడు. ఫలితంగా 196 పరుగులు భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముంగిట ఉంచింది. బెంగళూరు బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టగా, ఉడానా, మొయిన్‌ అలీ చెరో వికెట్‌ తీశారు.
webdunia
 
ఆ తర్వాత 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనను బెంగళూరు దారుణంగా ఆరంభించింది. పవర్‌ప్లేలోనే దేవదత్‌ పడిక్కల్‌ (4), అరోన్‌ ఫించ్‌ (13), డివిలియర్స్‌ (9) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ కాసేపు వేగం కనబరిచాడు. అయితే, రబాడ వేసిన 14వ ఓవర్లో విరాట్‌ వికెట్‌ కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతోనే బెంగళూరు ఓటమి దాదాపు ఖాయమైంది. ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో వరుస విరామాల్లో పెవిలియన్‌ బాటపట్టారు. రబాడ పదునైన బంతులకు బెంగళూరు జట్టు కోలుకోలేకపోయింది. ఫలితంగా 24 పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి, ఆర్సీబీ వెన్ను విరిచాడు. దీంతో బెంగుళూరు జట్టు దారుణంగా విఫలమైంది. 
 
నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లను కోల్పోయిన ఆర్సీబీ 137 పరుగులకు మాత్రమే పరిమితమై, పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ కు 2 వికెట్లు, మొయిన్ అలీ, ఉదానాకు చెరో వికెట్ లభించాయి. ఈ విజయం ఢిల్లీకి నాలుగోది కాగా, 8 పాయింట్లతో అగ్రస్థానంలోకి వెళ్లింది. రాయల్ చాలెంజర్స్‌కు ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2020 : అగ్రస్థానం కోసం ఆరాటం... ఢిల్లీ వర్సెస్ బెంగుళూరు