భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు సురేష్ రైనా. ఐపీఎల్ 2020 కోసం ఇటీవల జట్టుతో కలిసి దుబాయ్‌కు వెళ్లాడు. జట్టుతో కలిసి రెండు రోజుల పాటు హోటల్‌లో ఉన్నాడు. ఇంతలో ఏమైందో ఏమోగానీ.. హుటాహుటిన స్వదేశానికి తిరిగివచ్చాడు. దీనిపై అనేక రకాలైన పుకార్లు, ఊహాగానాలు వస్తున్నాయి. జట్టు యాజమాన్యంతో గొడవపడి తిరిగి వచ్చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీటిని చూసిన సురేష్ రైనా స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని, తన కుటుంబం కోసం తాను తిరిగొచ్చానని రైనా చెప్పాడు. ఇతరత్రా కారణం ఏదైనా ఉన్నట్టయితే తాను ఇంటికి రాగానే చెప్పి ఉండే వాడినని రైనా తెలిపాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తనకు కుటుంబం లాంటిదని.. పైగా మహీ భాయ్(ఎంఎస్ ధోనీ) తనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని రైనా చెప్పుకొచ్చాడు. సీఎస్‌కే జట్టుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పాడు.
అయినా.. బలమైన కారణం ఏదీ లేకుండా రూ.12.5 కోట్లను వదులుకుని ఎవరూ వెనుదిరగరని రైనా తెలిపాడు. తాను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఉండొచ్చు కానీ తాను ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున మరో నాలుగైదు సీజన్‌లు ఆడతానని సురేష్ రైనా స్పష్టం చేశాడు.
కాగా, సురేష్ రానా రావడానికి బలమైన కారణం ఉంది. రైనా మేనత్త కుటుంబ సభ్యులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈదాడిలో మేనమామ ప్రాణాలు కోల్పోగా మేనత్త కూడా చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలియగానే సురేష్ రైనా దుబాయ్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చాడు.