Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2020 : చెన్నైకు రెండో ఓటమి.. షా.. జబర్దస్త్ షో... ఢిల్లీకి గెలుపు

ఐపీఎల్ 2020 : చెన్నైకు రెండో ఓటమి.. షా.. జబర్దస్త్ షో... ఢిల్లీకి గెలుపు
, శనివారం, 26 సెప్టెంబరు 2020 (09:11 IST)
ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండో ఓటమిని చవిచూసింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో సీఎస్కే జట్టు ప్రయాణం ఏడు వికెట్ల నష్టానికి 131 పరుగుల వద్దే ఆగిపోయింది. ఫలితంగా ధోనీ సేన ఈ టోర్నీలో వరుసగా రెండో ఓటమిని చవిచూడగా, ఢిల్లీ జట్టు వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 175 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పృథ్వీషా 43 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 175 పరుగులు చేయగా, ధవన్ 35 (27 బంతుల్లో), పంత్ 37 (25 బంతుల్లో), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 26 (22 బంతుల్లో) పరుగులు చేశారు. 
 
చెన్నై బౌలర్లలో చావ్లా 2 వికెట్లు తీసుకోగా, శామ్ కరన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక, ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచిన ఢిల్లీ 4 పాయింట్లతో జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ సత్తా చాటి ఘన విజయం సాధించడం గమనార్హం. 
 
ఇకపోతే ఢిల్లీ నిర్దేశించిన 176 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై తొలి నుంచే ఆపసోపాలు పడింది. జట్టు స్కోరు 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ షేన్ వాట్సన్ (14) అవుటయ్యాడు. ఇక, అప్పటి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ పరాజయానికి చేరువైంది.
 
చెన్నై జట్టులో ఒక్క డుప్లెసిస్ మినహా మరెవరూ చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. 35 బంతులు ఎదుర్కొన్న డుప్లెసిస్ 4 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసి కాసేపు ఢిల్లీ జట్టును కంగారు పెట్టాడు. అతడు అవుటయ్యాక సీఎస్‌కే జట్టు ఓటమికి మరింత దగ్గరైంది. 
 
కేదార్ జాదవ్ (26) కాసేపు క్రీజులో నిలదొక్కుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఓవైపు తగ్గిపోతున్న ఓవర్లు, పెరుగుతున్న లక్ష్యాన్ని చూసిన బ్యాట్స్‌మెన్ మరింత ఒత్తిడికి లోనై వికెట్లు సమర్పించేసుకున్నారు.
 
చివరికి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసి విజయానికి 44 పరుగుల దూరంలో నిలిచిపోయారు. మురళీ విజయ్ 10, రుతురాజ్ గైక్వాడ్ 5, ధోనీ 15, శామ్ కరన్ 1, రవీంద్ర జడేజా 12 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో రబడ 3 వికెట్లు పడగొట్టగా, అన్రిక్ నోర్ట్‌జే 2, అక్సర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీకి చేదు అనుభవం.. రూ. 12 లక్షల జరిమానా.. ఎందుకో తెలుసా?