భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అన్ని అంతర్జాతీయ క్రికెట్ ఫార్మెట్ల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ధోనీ నాయకత్వంలో సీఎస్కే జట్టు ఇప్పటికే మూడుసార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఇపుడు మరోమారు టైటిల్ రేసులో ఉండే ప్రధాన జట్లలో ఒకటిగా నిలిచింది.
ఇక ఐపీఎల్ 13వ సీజన్ కోసం యూఏఈకి చేరుకుంది. ఇందుకోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే, కొంతమంది జట్టు సభ్యులకు కరోనా సోకినా .. రైనా, హర్భజన్ సింగ్ జట్టుతో లేకపోయినా.. ఇబ్బందులతో సంబంధం లేకుండా కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. ధోనీ ఉన్నంతవరకు తనకు ఎలాంటి టెన్షన్ లేదని ఇటీవల జట్టు యజమాని శ్రీనివాసన్ కూడా ప్రకటించారు.
అయితే, ధోనీ లేకపోతే సీఎస్‌కే పరిస్థితి ఏంటనేదే ప్రశ్నగా మిగిలిపోయింది. ఏదో ఒకరోజు ధోనీ ఐపీఎల్‌కూ రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. అప్పడు ఏం జరుగుతుంది? ఇదే విషయమై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో మాట్లాడాడు. "ధోని లేకపోతే సీఎస్‌కే సగం అవుతుంది. జట్టు సమస్యల్లో పడుతుంది." అని ఆకాశ్ అన్నాడు.
"ఏదో ఒక రోజు ధోనీ సీఎస్‌కేకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ భారీ నష్టాన్ని చవిచూస్తుంది. ఎందుకంటే ఆ జట్టును ధోనీ నడిపించే విధానం అలాంటిది. అతడిలా జట్టును నడిపే వారు ఉండరని నా అభిప్రాయం" అని చోప్రా అన్నాడు.
"సీఎస్‌కేకు తర్వాత ఎవరు కెప్టెన్ అయినా.. ధోనీలా జట్టును నడపలేరని నేను అనుకుంటున్నా. అయితే కెప్టెన్‌గా రాజీనామా చేసినా.. ధోనీ జట్టులో ఏదో ఒక పదవిలో.. బ్రాండ్ అంబాసిడర్‌గా, గురువుగా ఉండి చెన్నై సూపర్ కింగ్స్‌కు మద్దతుగా ఉంటాడని నేను భావిస్తున్నా. ఎందుకంటే ధోనీకి, సీఎస్‌కేకు ఉన్న బంధం అలాంటిది" అని చోప్రా చెప్పాడు.