కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై తొలి పరాజయాన్ని చవిచూసింది. అదరగొట్టే బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై పనిపట్టింది.
ముంబై బౌలర్లంతా సమష్టిగా రాణించడంతో చెన్నై స్కోరును అడ్డుకున్నారు. జట్టు కెప్టెన్ రోహిత్ పోరాటానికి బౌలింగ్‌తో న్యాయం చేశారు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో చెన్నై పరుగుల పరంగా రెండో అతి పెద్ద ఓటమిని మూటగట్టుకుంది.
చెన్నైని ఓడించడం ద్వారా ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ ఖాతాలో మరికొన్ని రికార్డులు చేరాయి. శుక్రవారం చేపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టు 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ముంబై కెప్టెన్ రోహిత్ (67; 48 బంతుల్లో 6×4, 3×6) చెలరేగడంతో ముంబయి జట్టు ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు విజయంతో పాటు కొన్ని రికార్డులు కూడా వరించాయి.
అవేంటంటే..? చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మీద ఎక్కువ అర్ధ శతకాలు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తొలిస్థానంలో నిలిచాడు. సీఎస్కేపై హిట్ మ్యాన్ ఏకంగా 7 అర్ధ శతకాలు బాదాడు. తర్వాతి స్థానంలో వార్నర్(6), ధావన్(6), విరాట్ కోహ్లీ(6), వాట్సన్(5), గంభీర్(5) ఉన్నారు.
ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ సార్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న ఇండియన్ క్రికెటర్లలో రోహిత్ ముందంజలో ఉన్నాడు. ఐపీఎల్‌లో మొత్తంగా 17 సార్లు హిట్ మ్యాన్ ఈ అవార్డు దక్కించుకున్నాడు.
చెన్నై చేపాక్ స్టేడియంలో రోహిత్ ఆరు మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ గెలుపును నమోదు చేసుకున్నాడు. ఇదే చేపాక్ స్టేడియంలో రోహిత్ తొలిసారి అర్థ సెంచరీని నమోదు చేసుకున్నాడు.