Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆయన ఫోన్ చేయగానే మారుమాట్లాడకుండా ఓకే అనేశా: ప్రియా ప్రకాశ్ వారియర్

ఆయన ఫోన్ చేయగానే మారుమాట్లాడకుండా ఓకే అనేశా: ప్రియా ప్రకాశ్ వారియర్
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:25 IST)
Priya Prakash Varrier
ప్రియా ప్రకాశ్ వారియర్, మ‌ల‌యాళ న‌టి. ఆమె చేసిన `ఒరు అడార్ ల‌వ్‌` సినిమా తెలుగులో `ల‌వ‌ర్స్‌డే`గా వ‌చ్చింది. రెండేళ్ళ‌యినా ఏ సిసినిమా చేయలేదు. అయినా హైద‌రాబాద్ వ‌స్తే ఇక్క‌డి అభిమానుల‌ను చూస్తుంటే ఆశ్చ‌ర్య‌మేస్తుంది. `చెక్‌` సినిమాలో పాత్ర కోసం ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఫోన్ చేయ‌గానే, మారు మాట్లాడ‌కుండా ఓకే చేసేశానంటోంది. ఎందుకు అలా అన్న‌ది అనేది ఆమె మాట‌ల్లో తెలుసుకుందాం.

నితిన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా 'చెక్'. ఇందులో ప్రియా ప్రకాశ్ వారియర్ ఓ కథానాయిక. శుక్రవారం (ఫిబ్రవరి 26న) సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్తో ఇంటర్వ్యూ.
 
క‌థ కూడా వినకుండా చంద్రశేఖర్ యేలేటిగారు ఫోన్‌ చేస్తే ఓకే చెప్పేశారట?
అవును. ఆయన దర్శకత్వం వహించిన 'మనమంతా' చూశా. మలయాళంలో. అక్కడ 'విస్మయం' పేరుతో విడుదలైంది. అందులో నా అభిమాన హీరో మోహన్ లాల్ నటించడంతో మిస్ కాలేదు. ఆ సినిమా చూసినప్పుడు చందూ సార్ ఎంత గొప్ప డైరెక్టర్ అనేది అర్థమైంది. ఆయన ఫోన్ చేసి 'చెక్'లో నువ్వు నటించాలని అడిగారు. సీనియర్, బ్రిలియంట్ డైరెక్టర్ అడిగారు, పైగా నితిన్, రకుల్ చేస్తున్నారని చెప్పారు. మంచి స్టార్ కాస్ట్, మంచి ప్రొడక్షన్ హౌస్ కనుక హ్యాపీగా ఓకే చేశా.
 
సినిమాలో మీ పాత్ర ఏంటి?
నా పాత్ర గురించి ఎక్కువ చెప్పలేను. కానీ, ఆదిత్య ప్రేయసి యాత్ర పాత్రలో నటిస్తున్నాని చెప్పగలను. ఆదిత్యగా నితిన్ నటించారు. ఆదిత్య ప్రయాణమే 'చెక్'. ఆ ప్రయాణంలో యాత్ర ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసింది. అడ్వెంచరస్ గాళ్ తరహాలో నా పాత్ర ఉంటుంది.
 
నితిన్‌తో న‌టించ‌డం ఎలా అనిపించింది?
నితిన్ అనుభవం ఉన్న హీరో. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అందుకని, బిగినింగ్‌లో టెన్షన్ పడ్డాను. అయితే, సెట్లో అందరూ నేను కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకున్నారు. నితిన్ సీనియర్, నేను న్యూకమర్ వంటి తేడాలు చూపించలేదు. ప్రతి ఒక్కరూ మమ్మల్ని సమానంగా చూశారు. అందుకు నితిన్ కూడా కారణం.
 
నిర్మాత ఆనందప్రసాద్‌గారి బేన‌ర్‌లో చేయ‌డం ఎలా  అనిపించింది?
వెరీ సపోర్టివ్. యాత్ర పాత్రలో చందూ సార్ నన్ను చూశారు. ఒకవేళ నిర్మాత ఆ పాత్రకు నన్ను వద్దని అంటే, మరో అమ్మాయిని ఎంపిక చేయాలి. చందూ సార్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వడం వల్లే నేను ఈ సినిమా చేయగలిగాను. నాపై నిర్మాత ఆనందప్రసాద్ గారు నమ్మకం ఉంచారు.
 
చంద్రశేఖర్ యేలేటి మీరు బాగా నటించారని చెప్పారు. సెట్స్ లో మీ యాక్టింగ్ చూసి ఏమన్నారు?
చందూ సార్ ఎక్స్‌ప్రెషన్స్ న్యూట్రల్‌గా ఉంటాయి. ఆయన సంతోషంగా ఉన్నారో, బాధలో ఉన్నారో చెప్పడం కష్టం. మనం ఊహించలేం. షూటింగ్ చేసేటప్పుడు షాట్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన వైపు చూసేదాన్ని. నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. 'సార్! నేను బాగా చేశానా? ఓకేనా?' అని అడిగితే... 'యా యా ఓకే' అనేవారు. అద్భుతంగా నటించినా, సరిగా చేయకపోయినా ఆయన ఒకేలా ఉంటారు. అర్థం కాదు. అలాంటిది మీతో నేను బాగా నటించానని చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది. పెద్ద విషయం.
 
సెట్స్ లో మీరు పాటలు కూడా పాడేవార‌ట‌?
 సెట్స్ లో ఫ్రీ టైమ్ దొరికితే నాకు పాటలు పాడటం అలవాటు. ఏదో ఒక పాట హమ్మింగ్ చేస్తా. నేను పాడుతుంటే చందూ సార్ ఎంజాయ్ చేసేవారు. 'చెక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'నువ్వు మాట్లాడతావా? పాట పాడతావా?' అని అడిగారు.
 
తెలుగులో మీకిది తొలి సినిమా. షూటింగులో ప్రాంప్టింగ్ లేకుండా డైలాగులు చెప్పారట. ముందే ప్రాక్టీస్ చేశారా?
షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెండు రోజుల ముందు చందూ సార్, కో డైరెక్టర్లతో కొన్ని రీడింగ్ సెషన్స్ లో పాల్గొన్నా. ప్రతి డైలాగ్ చదివాను. వాటి అర్థం అడిగి తెలుసుకున్నాను. నేను ఏం చెబుతున్నానో నాకు పూర్తిగా తెలిస్తే, భావోద్వేగాలను బాగా పలికించగలను. ప్రాంప్టింగ్ ఐడియా నాకు నచ్చదు. ఎవరో ప్రాంప్టింగ్ చెబుతుంటే యాక్టింగ్ మీద కాన్సంట్రేట్ చేయలేను. సెట్స్ లో కూడా డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత నెక్స్ట్ సీన్ లో డైలాగులు ప్రాక్టీస్ చేశా.
 
రెండు రోజుల్లో డైలాగులు నేర్చుకోవ‌డం విశేష‌మే గ‌దా?
కొన్నిసార్లు డైలాగులు చదివిన తర్వాత వచ్చేస్తాయి. ఇప్పుడు నాతో ఎవరైనా తెలుగులో మాట్లాడితే... వాళ్లు ఏం చెబుతున్నారో అర్థం అవుతుంది. కొంచెం కొంచెం మాట్లాడగలను. తెలుగులో ఇంకొన్ని సినిమాలు చేస్తే పూర్తిగా తెలుగులో మాట్లాడతాను.
 
మాటలేకాదు, పాటలు కూడా పాడుతున్నారు కదా?
 ప్రయివేట్ సాంగ్ 'లడీ లడీ' పాడాను. అవకాశం వస్తే నా సినిమాల్లోనూ పాడాలని అనుకుంటున్నా. 'చెక్'లో ఒకే ఒక పాట 'నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను' ఉంది. ముందు దానికి నాతో పాడించాలని అనుకున్నారు. ఎందుకంటే,  మేం షూటింగ్ చేసేటప్పుడు సెట్స్ లో నేను పాటలు హమ్ చేస్తూ ఉండేదాన్ని. అది చందూ సార్ గమనించారు. సాంగ్ ట్రాక్ పంపించారు. కానీ, కుదరలేదు. ఇక నుంచి కుదిరితే నా పాత్రకు డబ్బింగ్ చెప్పడంతో పాటు అవకాశం వస్తే పాటలు కూడా పాడాలని అనుకుంటున్నాను.
 
తెలుగులో మీకు చాలామంది అభిమానులు ఉన్నారే?
తెలుగు ప్రజలు చూపించే ప్రేమ, అభిమానం నెక్స్ట్ లెవెల్. 'చెక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లాను. అక్కడ క్రౌడ్ అయితే క్రేజీ. క్రౌడ్ నుంచి బయటపడతానని అనుకోలేదు. స్టేజ్ దిగిన తర్వాత అభిమానులు చుట్టుముట్టారు. 'ఇక్కడ స్టక్ అయిపోయా' అనుకున్నాను. స్టేజ్ నుంచి హాలు వరకు రావడానికి కొంత సమయం పట్టింది. ఇంతమంది అభిమానం సొంతం చేసుకోవడం బ్లెస్సింగ్. 'లవర్స్ డే' తర్వాత రెండేళ్లుగా నేను ఏమీ చేయలేదు. 'చెక్' వంటి మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూశా. రెండేళ్ల నుంచి నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ ఇటువంటి సంఘటన ఏదో ఒకటి జరుగుతుంది.
 
ప్రస్తుతం మీరు చేస్తున్న చిత్రాలు?
తెలుగులో 'ఇష్క్' చేస్తున్నా. కన్నడలో 'విష్ణుప్రియ' చేశా. అందులో ఓ పాట కూడా పాడాను. హిందీలో 'శ్రీదేవి బంగ్లా'తో పాటు మరో సినిమాలో నటించా.
 
 'చెక్' సినిమా చూశారా?
లేదు. హైదరాబాద్ లో ఫ్యామిలీతో కలిసి చూడాలని అనుకున్నాను. అయితే, 26వ తేదీన తమ్ముడికి ఎగ్జామ్ ఉంది. అందువల్ల, ఫ్యామిలీ హైదరాబాద్ రావడం కుదరడం లేదు. కొచ్చిలో కూడా 'చెక్' రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి అక్కడ షోకి వెళ్లే ప్లాన్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్పెనకు బాగా కనెక్ట్ అయిన యూత్, మాస్క్ లేకుండా తోసుకుంటూ వచ్చేస్తున్నారు