Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసిస్టెంట్‌ దర్శకుడిగా వెళదాం అనుకున్నా : నాని ఇంటర్వ్యూ

'అష్టాచమ్మా'తో ఒక్కసారిగా నటుడిగా మారి క్యాజువల్‌గా నటించేవాడిగా పేరు తెచ్చుకున్న నాని ఆ తర్వాత పలు చిత్రాలు చేశాడు. అంతకుముందు అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేసిన అనుభవంతోనే తనకు హీరోగా ఛాన్స్‌ వచ్చిందని

Advertiesment
Nani interview
, బుధవారం, 15 జూన్ 2016 (19:53 IST)
'అష్టాచమ్మా'తో ఒక్కసారిగా నటుడిగా మారి క్యాజువల్‌గా నటించేవాడిగా పేరు తెచ్చుకున్న నాని ఆ తర్వాత పలు చిత్రాలు చేశాడు. అంతకుముందు అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేసిన అనుభవంతోనే తనకు హీరోగా ఛాన్స్‌ వచ్చిందని చెబుతున్న నాని తను హీరో అనగానే.. నన్ను అనవసరంగా నమ్ముతున్న పిచ్చివాళ్ళుగా కన్పించారట. ఆ తర్వాత  ఏదో క్యాజువల్‌గా సినిమా చేసేస్తే పోలా! అనిపించి చేశాక... జనాల ఆదరణ చూసి తను పిచ్చివాడిగా మారాడు.


అంటే.. హీరోగా రాణించాలనే పిచ్చితో.. పలు చిత్రాలు చేశాడు. కొన్ని ఎత్తుపల్లాలు వున్నా... ఎవడే సుబ్రహ్మణ్యంతో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 'భలేభలే మగాడివోయ్‌'తో పెద్ద హిట్‌ దక్కించుకున్నాడు. తాజాగా.. 'జెంటిల్‌మెన్‌'గా ముందుకు వస్తున్నారు. ఈ నెల 17న వస్తున్న తన చిత్రం గురించి ఇతర విషయాలను నాని ఈ విధంగా చెబుతున్నారు.
 
మీరు హీరోనా! విలనా!?
ఇదే అందరూ అడుగుతున్నారు. పబ్లిసిటీ అలా చేశాం. రెండు కోణాలుంటాయి. అవి సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
 
మీరు కథ వినేటప్పుడు దేన్ని కొలమానంగా భావిస్తారు?
ముందుగా ప్రేక్షకుడిగా ఫీలవుతాను. హైదరాబాద్‌ సత్యం థియేటర్‌లో సినిమా చూసే ప్రేక్షకుడిగా నేను కథ వింటాను. అక్కడ థియేటర్‌ బయట అన్నీ కొన్ని బొమ్మలు వుంటాయి. అవి మనల్ని చూస్తున్నట్లు వుంటాయి. వారు కూడా నాతో వింటున్నట్లుగా ఫీలయి కథ వింటాను. ఎందుకంటే ఎన్నోసార్లు సత్యం థియేటర్లో సినిమాలు చూస్తూ పెరిగాను.
 
ఇటువంటి పాత్ర చేయడం ఎలా అనిపించింది?
రెండు షేడ్స్‌ వున్న పాత్ర అనగానే సవాల్‌గా భావించా. అంతకుముందు 'భలే భలే మగాడివోయ్‌'లో మతిమరపు పాత్ర వేస్తే, 'కృష్ణగాడి ప్రేమగాధ'లో వీడింతే. ఇలాగే వుంటాడనే పాత్రను చేశాను. కానీ ఇది సెపరేట్‌ పాత్ర.. దీన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముంది.
 
ఈ పాత్రకు స్ఫూర్తి ఎవరైనా వున్నారా?
మనచుట్టూ కొద్దిమందిలో చూస్తాం. ఒకసారి బాగుంటారు. వెంటనే వారిలో ప్రవర్తన మారిపోతుంది. వీడికి తిక్క అనిపిస్తుంది. కానీ అనలేము కానీ అలా ప్రవర్తించేవారిలో తెలీని మిస్టరీ వుంటుంది.. అదే నేను ఈ సినిమాలో పోషించాను.
 
'అష్టాచమ్మా' తర్వాత మరలా ఇంద్రగంటితో చేయడం ఎలా వుంది?
'అష్టాచమ్మా'కు ముందు అసిస్టెంట్‌ దర్శకుడ్ని. దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ నాతో సినిమా చేస్తానన్నారు. నన్ను ఎవడు చూస్తాడు సార్‌! అన్నా వినలేదు. వీళ్ళంతా పిచ్చోళ్ళు. నన్ను అనవసరంగా నమ్మారని అనిపించింది. కానీ  ఆ సినిమా అయ్యాక.. వెంటనే అసిస్టెంట్‌గా వెళ్ళిపోవచ్చు గదా అనుకుని చేసేశాను. కానీ ప్రేక్షకులు నన్ను కూడా చూస్తారని తెలిసి ఆశ్చర్యపోయాను. అప్పడు లేని నమ్మకం.. ఇప్పుడు మరింత బలపడింది. అప్పుడు లేని టెక్నాలజీని మోహన్‌ గారు ఇప్పుడు మెరుగుపర్చుకున్నారు.
 
ఇందులో మీ పాత్ర ఏమి చేస్తుంది?
పాత్ర పేరు జై. చిత్రంలో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఓనర్‌గా చేశాను. కానీ తనలో మరో కోణం వుంటుంది. అది ఏమిటి? అనేది సినిమాలో చూడాల్సిందే. 
 
నిర్మాణ వాల్యూస్‌ ఎలా వున్నాయి?
ఈ చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌.. తను నాకు పెద్దగా తెలీదు. నా దగ్గరకు వచ్చి నేనే నిర్మాతను అన్నారు. గతంలో ఏవో తీసుంటారనిపించింది. తను అలాగే చెప్పారు. అంతా చెబుతూ చివర్లో.. 'ఆదిత్య 369' అనే సినిమా నేనే తీశానన్నారు. దాంతో ఆయన ఒక్కసారిగా పెద్దవ్యక్తిగా కన్పించారు. గౌరవం ఏర్పడింది. ఎందుకంటే ఆ చిత్రానికి నేను వీర ఫాన్‌ను. టెక్నాలజీ అభివృద్ధి చెందని రోజుల్లో ఆ సినిమాను తీసిన నిర్మాత నా దగ్గరకువచ్చి సినిమా చేస్తున్నానంటే.. అంతకంటే ఏం కావాలి..
 
అవసరాల శ్రీనివాస్‌తో సినిమా ఎంతవరకు వచ్చింది?
తను నాకు మంచి మిత్రుడు. మంచి ఆర్టిస్టులు. కానీ ఎందుకనో ఇంతవరకు తనకు తగిన గుర్తింపు రాలేదు. ఈ సినిమాలో కొత్త పాత్ర చేశాడు. పేరు వస్తుంది. తనలో మంచి దర్శకుడు కూడా వున్నాడు. దర్శకుడిగా తనతో చేస్తా. అయితే వాటికి ముందు.. ఆనంది ఆర్ట్స్‌లో పూర్తి ప్రేమకథా చిత్రం చేస్తున్నాను. ఆ తర్వాత దిల్‌ రాజు సినిమా. ఆ తర్వాతే.. శ్రీనివాస్‌ సినిమా.
 
ప్లాప్‌ సినిమాల గురించి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది?
నేను ఐదేళ్ళు వెనక్కు వెళ్ళినా మళ్ళీ పైసా.. ఆహా! కళ్యాణం.. వంటి సినిమాలే చేస్తా. ఎందుకంటే ఆ చిత్రాలే నాకు చాలా నేర్పాయి. ఆ అనుభవాన్ని ఎలా మర్చిపోతాను. ప్లాప్‌ అయినా.. అందులో తెలుసుకోవాల్సింది చాలా వుంటుంది. దానితోనే ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది.
 
ఎప్పుడూ సాధారణ దుస్తులే వేస్తారు?
ఏం చెప్పమంటారు. నా స్నేహితుడు, నా అక్క కూడా ఏంట్రా.. ఇవేమి డ్రెస్‌లూ అంటుంది. స్టెయిలిష్‌గా వుండేలా ఒక్క సినిమా చేయమని పోరు పెడుతుంది. కానీ.. అవి నాకు సూటు అవుతాయో లేదో కానీ... ఎప్పటికైనా ఒక సినిమా చేస్తాను. వ్యక్తిగతంగా నేను మామూలుగా వుండటానికి ఇష్టపడతా.. అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'దండుపాళ్యం' దర్శకుడి తాజా బ్లాక్ బస్టర్ 'బ్రాహ్మణ'.. ఇద్దరు భామలతో ఉపేంద్ర