తమిళ సినిమాలు తెలుగు సినిమావారి కంటే ఎక్కువ తెలివిని ప్రదర్శిస్తుంటారనే నానుడి వుంది. అక్కడ చాలా చిత్రాలు, కేరెక్టర్లు.. కూడా వినూత్నంగా మెచ్యూర్డుగా వుంటాయని టాలీవుడ్ టాక్. అయితే ఒక్కోసారి అక్కడా తప్పటడుగులు పడుతుంటాయి. నటి విద్యుల్లేఖ గురించి తెలిసే వుంటుంది. తను తమిళ అమ్మాయి అయి తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది.
రాజుగారి గది, సరైనోడు.. ఇలా పలు చిత్రాలలో తమిళం మిక్సయిన తెలుగులో మాట్లాడంతోపాటు నటనలోనూ మంచి గుర్తింపు తెచ్చకుంది. తాజాగా ఆమె తమిళ టీవీలో కమిస్తాన్ సిమ్మా పా.. అనే షో చేస్తుంది. ఇది తెలుగులో బజర్‌దస్త్ తరహాలోనిదన్నమాట. కానీ.. ఇలాంటి షో బాలీవుడ్‌లో మూడు సీక్వెల్సుగా వచ్చింది. మంచి ఆదరణ పొందింది. దీనికి ప్రేరణ స్టేజీ షో కావడం విశేషం. దీనిని అమెజాన్ సంస్థ వారు నిర్దేశిస్తున్నారు. ఈ షో ఇప్పటికే సిద్ధమైంది. దీనికి గురించి విద్యుల్లేఖ ఏమంటుందో చూద్దాం.
ఈ షోలో ఎంతమంది వుంటారు? ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది?
ఆరుగురు పాల్గొంటారు. ఇందులో నాతోపాటు మరో మహిళ ఆర్టిస్టు వుంది. కేవలం నిలుచుకుని అప్పటి కప్పుడు వీక్షకులను నవ్వించాలి.
మీకు స్పూర్తి ఎవరు?
నాకు మా నాన్నగారు మోహననారాయణ్‌గారే స్పూర్తి. నేను స్టేజీ ఆర్టిస్టుగానే పలు ప్రోగ్రామ్‌లు చేశాను. ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చాను. ఎప్పటికైనా స్టేజీ ఆర్టిస్టుగా మరలా రావాలనుకున్నా.. అది ఇలా నెరవేరుతుంది.
ఇలాంటి కామిక్ షో బ్రహ్మానందంగారితో చేశారు. సక్సెస్ కాలేదు. కారణం?
అవును. ఇంతకుముందు బ్రహ్మానందంగారితో కలిసి చేశాం. కానీ దాన్ని సరిగ్గా మలచడంలో రచయితలు, నిర్వాహకులు కృషి చేయలేదు.
మరి ఈ కేమిస్తాన్ ఎలా వుండబోతుందని అనుకుంటున్నారు?
దీనిని చాలా కేర్ తీసుకుని నిర్వాహకులు చేశారు. దాదాపు వందమందికి పైగా ఆడిషన్‌కు వచ్చారు. అందులో ఆరుగురు మాత్రమే ఎంపిక అయ్యాము. ఒక్కోరిది ఒక్కో శైలిలో కామెడీ టైమింగ్ వుంటుంది.
తెలుగులో చేసినన్ని వినూత్నమైన పాత్రలుగానీ, పేరుగానీ మీకు తమిళంలో రాలేదు. కారణం?
నిజమే. తమిళంలో నన్ను మలచుకోవడంలో వారి తప్పిదమే కనిపిస్తుంది. తెలుగులో అలా కాదు. బుజ్జమ్మ.. వంటి కొన్ని కొత్త తరహా పాత్రలు, మేనరిజాలు నన్ను బాగా దగ్గర చేశాయి. నా నటన నా వాచకం ఇక్కడ అందరినీ మెప్పించింది. ఇందుకు రచయితలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మీరు చాలా స్లిమ్ అయ్యారే? కారణం?
అవును. చాలా తగ్గాను. ఒకరకంగా చెప్పాలంటే హెల్త్ గురించి చూసుకోవాలిగదా. ఇప్పుడు 63 కేజీలు వున్నాను. అంతకుముందు 80 పైనే వుండేదానిని. రోజూ జిమ్‌కు వెళ్ళి పలు జాగ్రత్తలు తీసుకున్నా.
పెళ్లి చేసుకోబోతున్నారుగదా. పెద్దల కుదిర్చిందా?
పెళ్లి త్వరలో చేసుకోబోతున్నాను. ఏడాదిన్నర నుంచి మేం లవ్‌లో వున్నాం. ఆ వివరాలు ఇప్పుడు వద్దని చెప్పడంలేదు. కోవిడ్ టైంలో ఇవన్నీ ఎందుకని ఆగాం. అన్ని వివరాలు త్వరలో చెబుతాను.
ఈ షోకు ఎటువంటి ప్రిపరేషన్ చేసుకున్నారు?
ఈ షోకు నేను రచయితలతో కలిసి ముందుగా ప్రాక్టీస్ చేసుకుంటాను. ఏదైనా అనుమానం వుంటే దాన్ని సరిచేసుకుంటాను. స్పాన్‌టేనియస్‌గా కొన్ని పదాలు స్టేజీమీద పలకడానికి వీలుండేలా చూసుకుంటాను. రాసింది రాసినట్లు చేస్తే ఒక్కోసారి డెప్త్ రాదు. ఇందులో సామాజిక అంశాలు వుంటాయి.
బూతు కామెడీ వుంటుందా? దీనిపై మీ అభిప్రాయం?
బూతు కామెడీ అనేది పెద్దగా వుండదు. ఈ షోలో జడ్జిలకు పెద్దగా బూతులు రావు. 8 నుంచి 80 ఏళ్ళ వారు చూడగలిగే షో కాబట్టి నిర్వాహకులు కొన్ని సూచనలు చేశారు. నాకు తెలిసి అలాంటి పెద్దగా వుండవు అని చెప్పారు.