Publish Date: Fri, 07 Aug 2015 (17:27 IST)
Updated Date: Fri, 07 Aug 2015 (17:39 IST)
కొండపైన ఏముందో... తెలుసుకోవాలనే బలమైన కోరికతో కొండను ఎక్కుతూ, జారిపడుతూ... ఆఖరికి కొండ అంచుకు వెళ్ళి అక్కడికి చేరుకోగానే వర్ణించలేని ఆనందం ఎక్కిన వాడికే తెలుస్తుంది. అది బాహుబలి హీరోలో మనం చూస్తాం. ఇక జీవితంలో ఒక గోల్ సాధించాలని పలు మార్గాలు అన్వేషిస్తూ... ఎత్తుపల్లాలను చవిచూసి.. చేరుకున్న గమ్యం దర్శకత్వం కల నెరవేరి.. ఆ సినిమా విజయవంతంగా చేశావని అందరూ అభినందిస్తుంటే, అందులోని ఆ ఆనందం ఆ దర్శకుడికే తెలుస్తుంది. ఆయనే సాయి అచ్యుత్ చిన్నారి. ఇక్కడ చిన్నారి అనేది ఆయన సీరియల్ చేసిన పేరు, యాధృశ్చికంగా అదే ఆయన పేరులోనూ వుంది. ఈయన తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం 'ధనలక్ష్మీ తలుపు తడితే'. తొలి చిత్రంతోనే విజయం తలుపు తట్టింది. ఈ సందర్భంగా ఆయనతో వెబ్‌దునియా జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
మీ నేపథ్యం?
తూర్పుగోదావరి జిల్లా పరిషత్ పాఠశాలలో డ్రాయిగ్ టీచర్‌గా పనిచేసిన మా నాన్నగారు గోపాలకృష్ణ. ఆయన నుంచి 5వ ఏటనే డ్రాయింగ్ నేర్చుకున్నాను. ఆయన నాటక పరిషత్తుల్లోనూ పాల్గొంటుండేవారు. అలా నటన మా నాన్నగారి నుంచి వారసత్వంగా అబ్బింది. కాలేజ్ డేస్‌లో డ్రామాల్లో నటిస్తూనే.. దర్శకత్వం కూడా చేస్తుండేవాడ్ని. డిగ్రీ అయ్యాక 'ఈనాడు'లో కార్టూనిస్ట్‌గా, రిపోర్టర్‌గా పనిచేశాను. కొన్నాళ్లు ఏలూరులో పనిచేశాక- సినిమాల పట్ల ప్రేమతో హైద్రాబాద్ షిప్ట్ అయ్యాను. హైద్రాబాద్‌లో ఈటివి, మాటివి వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌కు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తూనే- పలు యాడ్ ఫిలిమ్స్ చేశాను.
సినీ ఎంట్రీకి ఎలా బీజం పడింది...?
దర్శకుడు కావాలన్న నా కలను నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. కొంతమంది హీరోలతో కథా చర్చలు జరిగినప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఆ క్రమంలో కథనే హీరోగా చేసుకుని కొన్ని స్క్రిప్టులు సిద్ధం చేసుకున్నాను. ఆ క్రమంలో ధనరాజ్ గారితో సోలో హీరోగా, నా డైరెక్షన్‌లో 'ఓ సచ్చినోడి ప్రేమకథ' అన్న సినిమా మొదలై.. కారణాంతరాల వల్ల ఆగిపోయింది. అదే కథను తమతో చేయమని కొందరు హీరోలు అడిగినప్పటికీ అది వారికి సూటవదనే ఉద్దేశ్యంతో సున్నితంగా, గౌరవంగా వాళ్లను తిరస్కరించాను. ఆ దశలో నాపై ధనరాజ్ గారికి సదభిప్రాయం ఏర్పడింది. అప్పట్నుంచి నా ప్రయాణం ఆయనతో సాగుతూ వచ్చింది.
'సచ్చినోడి ప్రేమకథ'కు ధనరాజ్‌నే హీరోగా ఎందుకు ఎన్నుకున్నారు?
ఆ కథలో హీరో జీరో అయి ఉండాలి. అతనికి ఎలాంటి ఇమేజ్ ఉండకూడదు. కథ ప్రారంభంలోనే హీరో చనిపోతాడు. ఇమేజ్ ఉన్న హీరోతో ఆ కథ రాణించదు.
మీ దృష్టిలో ధనరాజ్ ఇప్పుడు హీరోనా... జీరోనా..?
నా దృష్టిలో అతడు ఎప్పటికీ జీరోనే. అలా ఎందుకంటున్నానంటే గణితంలో ఒక సంఖ్యకు కుడి వైపు '0'ను నిలబెడితే ఆ సంఖ్య విలువ 10 రెట్లు పెరుగుతుంది. అలా తన పక్కనున్న వ్యక్తికి పది రెట్లు విలువ పెంచగలిగినవాడు మా తమ్ముడు ధనరాజ్. ఇందులో ఓ ప్రమాదం కూడా ఉంది. పొరబాటున ఆ జీరో ఓ సంఖ్య ఎడమ వైపుకు వెళితే... ఆ జీరో డిలిట్ అయిపోతుంది. అందువల్ల ఆ జీరో ఎప్పుడూ కుడి వైపునే తన స్థానం అనే సంగతిని మర్చిపోకూడదు.
మేకింగ్‌లో ధనరాజ్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఏమైనా వుందా?
కథ అనుకున్నప్పుడు దానిపై చర్చించడం, ప్రి-ప్రొడక్షన్ పనుల్లో జరిగింది. సీన్ ఎలా వుండాలి. లొకేషన్ ఏ మేరకు వుండాలనేవి అన్నీ పెయింటింగ్‌లా స్కెచ్‌లు వేసి చూపించేవాడిని. నిజానికి ఈ కథ అవుట్‌లైన్ మాత్రమే అతనికి తెలుసు. కథా పరమైన చర్చల్లో అతను ఒక్క రోజు కూడా ఇన్వాల్వ్ అవలేదు. ఈ సినిమాను ఎలాగైనా అనుకున్నవిధంగా పూర్తిచేయాలనే పట్టుదల ఆయనలోనూ, నాలో వుండేది. అందుకే 21 రోజుల్లో సినిమాను పూర్తి చేయడానికి ఆయన పూర్తి సహకారాన్ని అందించారు. ఇతర ఆర్టిస్టులను కమిట్ చేయడంలో ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్ వుంది. అలా ఆయనపై గౌరవంతోనే ఈ చిత్రంలోకి వచ్చినవారంతా.
సాధారణంగా మొదటిసారి దర్శకత్వం చేసేటప్పుడు దర్శకుడికి కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయి..?
ఒక దర్శకుడి కనే అందమైన కల సినిమా. ఆ కలను నిర్మాత పూర్తిగా నమ్మితేనే యథాతథంగా తెరపైకి వస్తుంది. ఉదాహరణకు ఓ చిత్రకారుడు ఓ అందమైన అమ్మాయి చిత్రాన్ని గీస్తానని మాత్రమే మొదట చెప్పగలడు. కానీ గీయాల్సింది అతనే. చిత్రకారుడు పెన్సిల్ స్కెచ్ వేసేంతవరకూ ఆ బొమ్మ రూపురేఖలు ఎవరికీ తెలియవు. ఆ పెన్సిల్ స్కెచ్ వచ్చాక ఆ బొమ్మలో ఉన్న చీర అంచుకు ఎర్ర రంగు వేస్తే బావుంటుంది లేదా నీలం చుక్కలు పెడితే బావుంటుంది అని ఎవరైనా సలహా ఇవ్వగలరు. సలహా చెప్పినంత మాత్రాన తామే ఆ బొమ్మ వేశామని చెప్పుకోవడం మూర్ఖత్వం అవుతుంది. అలాంటివారు పరిశ్రమలో ఎందరో ఉన్నారు. కానీ ధనరాజ్ గారి వల్ల నాకు అలాంటి పరిస్థితి ఎదురవలేదు.
దర్శకుడు మీరనే విషయాన్ని బయట తెలీకుండా జాగ్రత్త పడటంలో ఏమైనా ఆంతర్యం వుందా?
అజ్ఞాతవాసంలో అర్జునుడు.. తన పేరును ఎక్కడా చెప్పుకోకూడదు. చెబితే.. కథ మొదటికి వస్తుంది. నన్ను నేను నిరూపించుకోవాలనే పెద్దగా పబ్లిసిటీ చేసుకోలేదు. సక్సెస్‌తో సమాధానం చెప్పాకనే బయటకు రావాలనుకున్నాను.
ఈ సినిమా చూశాక మిమ్మల్ని మొదట అభినందించింది ఎవరు?
నా స్నేహితులు చాలామంది ఫోన్లు చేసి అభినందించారు. అవకాశమిచ్చిన ధనరాజ్.. వేరే షూటింగ్ నిమిత్తం జోథ్‌పూర్‌లో వుండటంతో ఆయనకు వీలుపడలేదు. నా మాతృసంస్థ ఈటీవీ నుంచి ప్రశంసలు దక్కాయి. జగపతి బాబు, సీనియర్ నరేష్‌తో పాటు పలువురు అభినందించారు.
సాధారణంగా టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చేవారంటే సినీ ఇండస్ట్రీలో చిన్నచూపు ఉంటుంది... దీనిపై మీరేమంటారు...?
సినిమా దర్శకత్వ శాఖలో పదేళ్లపాటు పనిచేసినా... థియరీ మాత్రమే తెలుస్తుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ మొదటి సినిమా దర్శకత్వం వహించడంతోనే వస్తుంది. అదే టీవీలో ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించి సినిమాల్లోకి వస్తే పని చాలా సుళువవుతుంది. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధానం చాలామంది అనుసరిస్తున్నారు. మన దగ్గర టీవీ టెక్నీషియన్లు అంటే సినిమా వాళ్లకి చిన్నచూపు ఉన్నమాట వాస్తవమే. కానీ సముద్రఖని, పూరీ జగన్నాథ్, రాజమౌళి వంటి వారు టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చినవారన్న సంగతి మర్చిపోకూడదు.
చిత్రంలో కొన్నిచోట్ల సాగదీసినట్లుందని కామెంట్లు వచ్చాయి?
క్యారెక్టర్ పరిచయంతో కొన్ని సన్నివేశాలు చూపించాలి. లేదంటే లింక్ చెడిపోతుంది. దాంతో అది వారికి లాగ్ అనిపించొచ్చు. కొన్నివేల కథలు సినిమాలుగా వచ్చేశాక- ఇంతకుముందు రాని సరికొత్త కథతో సినిమా రూపొందించడం బ్రహ్మదేవుడికి సైతం సాధ్యం కాదు. కాకపోతే మనం చేయగలిగేది కథను కొత్తగా, సరికొత్త కోణంలో నడిపించగలగడం. 'ధనలక్ష్మి తలుపు తడితే' చిత్రం కోసం మేం చేసింది ఇదే. నెరేషన్ చాలా ఫ్రెష్‌గా ఉండేలా కేర్ తీసుకొన్నాం. ముఖ్యంగా- హీరోహీరోయిన్ల పాయింటాఫ్ వ్యూలో కాకుండా విలన్ పాయింటాఫ్ వ్యూలో స్టోరి నేరేట్ అవ్వడం 'ధనలక్ష్మి తలుపు తడితే' ప్రత్యేకత.
మిగతా టెక్నీషియన్లు ఎలా సహకరించారు?
ధనరాజ్‌గారు-రామసత్యనారాయణగారు- ప్రసాద్‌గారు- ప్రతాప్‌గారు.. అందరూ చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడంతో ఎగ్జిక్యూషన్ చాలా స్మూత్‌గా జరిగింది. కెమెరామెన్ శివ(జి.శివకుమార్)తో నేను చాలా రోజులుగా ట్రావెల్ అవుతుండడం వల్ల- సినిమా అవుట్‌పుట్ మేం అనుకొన్నదాని కంటే బాగా వచ్చింది. డైరెక్టర్ కన్సీవ్ చేసుకొన్న సీన్స్‌ను తన కంటితో చూస్తూ- ప్రేక్షకులకు కనువిందు చేసేవాడు కెమెరామెనే కాబట్టి- 'ధనలక్ష్మి తలుపు తడితే' చిత్రం బాగా రావడంలో మా శివ సహాయసహకారాల పాత్ర ఎంతైనా ఉందని చెప్పాలి.
14 ఏళ్ల శ్రమ అనంతరం మీ సినీ కల నెరవేరింది. ఇందులో మీ ఫ్యామిలీ సపోర్ట్...?
రొటీన్ మాటే అయినప్పటికీ ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందన్నది నా విషయంలో అక్షర సత్యం. ఒక రకంగా చెప్పాలంటే ప్రి-ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ నా ఇంటి నుంచే జరిగాయి. ఆ క్షణంలో నా టీమ్‌ను సైతం కుటుంబ సభ్యుల్లా నా భార్య ఆదరించిన విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ తరపున అందరికీ నా థ్యాంక్స్.
మరి మీ ఇంటిని ధనలక్ష్మి తలుపు తట్టిందా...
మొదట నిర్మాత ఇంటి తలుపు తట్టింది. అది సంతోషం.
ధనలక్ష్మి... చిత్రంతో మీ అనుభవం...?
సాహసం ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫలానా హీరోతోనే అని రూపొందించలేదు. కథే హీరోగా నా మొదటి ప్రయత్నం సఫలమైనందుకు చాలా ఆనందంగా ఉంది.
భవిష్యత్‌లో ఎలాంటి చిత్రాలు తీయాలనుకుంటున్నారు?
కాస్పెప్ట్‌ను నమ్ముకుని చిత్రాలు తీస్తాను. కథకే ప్రాధాన్యత ఇస్తాను. ముఖ్యంగా నిర్మాత శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాలన్నదే నా ఆశ అని ముగించారు.