కరోనా ప్రభావంతో ఇండస్ట్రీ విపత్కర పరిస్థితుల్లో ఉంది. 24 క్రాప్ట్స్ నుండి థియేటర్స వరకూ నెలకొన్న స్తబ్దత అందరినీ ఆలోచనల్లో పడవేస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎప్పుడు మళ్ళీ షూటింగ్స్ మొదలవుతాయి. ఈ సంవత్సరం పరిశ్రమ మనుగడ ఎలా ఉండబోతుంది అనే విషయాలపై తెలంగాణా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత పి. రామ్మోహన్ శుక్రవారంనాడు ఇచ్చిన ఇంటర్‌వ్యూ సారాంశం.
ఇండస్ట్రీ పరిస్థితి ఎప్పుడు మాములు అయ్యే అవకాశాలున్నాయి..?
అన్ని పరిశ్రమలలో ఉన్న పరిస్థితే పిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉంది.. అంతకంటే ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమా పరిశ్రమ మళ్ళీ మామూలు పరిస్థితికి రావడానికి ఎక్కువ టైం పట్టొచ్చు. సమ్మర్ సీజన్‌నే కాదు.. ఈ సంవత్సరం కూడా మిస్ అయినట్లే అనుకోవాలి. జనవరి వరకూ ఈ పరిస్థితి కోనసాగుతుంది అని నా అంచనా. సినిమా అంటే ప్రేక్షకులు వందల సంఖ్యలో వస్తారు. అంతమంది ఒకసారి వచ్చినా ఎటువంటి భయాలు ఉండని పరిస్థితి వచ్చే వరకూ సినిమా థియేటర్స్ పరిస్థితి మెరగవదు. మాల్స్, ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్స్ మాదిరిగానే థియేటర్స్ రికవరీ కూడా ఎక్కువ టైం పడుతుంది. అందరూ దానికి ప్రిపేర్ అవ్వాలి.
పెద్ద సినిమాలు పరిస్థతి ఏంటి..?
పెద్ద సినిమాలు, అంటే థియేటర్స్ దగ్గర రెవిన్యూని రాబట్టగలిగే సత్తా ఉన్న సినిమాలు తప్పకుండా ఆగాల్సిందే.. థియేటర్స్‌కు ప్రేక్షకులు నిర్భయంగా వచ్చే టైం వరకూ సినిమాలను వాయిదా వేసుకోవాల్సిందే. నిర్మాతలు కూడా సినిమాలను ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేసేందుకు ఇష్టపడరు. నేను నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’ నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈమూవీని సమ్మర్ రిలీజ్ అనుకున్నాం.. ఇంకా 15 రోజులు షూటింగ్ ఉంది.. ఈ సినిమా రిలీజ్ డేట్స్ తారుమారు అయ్యాయి. థియేటర్స్ దగ్గర సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ ఆగాల్సిందే. తప్పదు.
ఎప్పుడు షూటింగ్స్ మొదలవుతాయని అంచనా?
దాన్ని ఇప్పుడే ఎవరూ ఊహించలేము. ఒక వందమందితో షూట్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా షూటింగ్స్ మొదలవుతాయి. కానీ ఇప్పుడే మనం ఖచ్చితంగా పరిస్థితిని అంచనా వేయలేం కానీ మరో ఆరునెల్లో షూటింగ్స్ మొదలవుతాయని నా అంచనా. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ లిమిటెడ్ క్రూతో చేసుకొనే అవకాశాలుంటాయి. కానీ థియేటర్స్ దగ్గర సాధారణ పరిస్థితులు లేనప్పుడు షూటింగ్స్ కూడా మొదలవ్వవు. వైరస్ పూర్తిగా పోనంతవరకూ థియేటర్స్‌కు ప్రేక్షకులు అంత సులభంగా రారు. అప్పటివరకూ చిన్నచిన్న పనులు అయితే నడుస్తాయేమో కానీ, పూర్తిస్థాయి షూటింగ్స్ మొదలవ్వడం జరగదు.
ఓటిటి ప్లాట్ఫామ్‌లు పుంజుకుంటాయా..?
అక్కడ కూడా సినిమా స్టాండెర్డ్స్‌ని మెయిన్‌టైన్ చేస్తున్నారు. షూటింగ్స్ జరగాలంటే తప్పకుండా మినిమమ్ 50 మంది సిబ్బంది అవసరం అవుతారు. సీరియల్స్ అయినా ఓటిటి అయినా అంత సులభంగా షూటింగ్స్ జరిగే పరిస్థితులు కనపడటం లేదు. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఈ యేడాది అంతా ప్రభావం ఉంటుంది.
ఓటిటి ప్లాట్‌ఫామ్‌ల మీదకు పెద్ద సినిమాల బడ్జెట్‌లు వర్కవుట్ అవుతాయా..?
ఓటిటి ప్లాట్ఫామ్ మీద పెద్ద సినిమాలు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీగా లేరు. ఎందుకంటే వారి బడ్జెట్లు ఓటిటి మీద వర్కవుట్ అవ్వవు. సినిమా బిజినెస్ వేరు, ఓటిటి బిజినెస్ వేరు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నిర్మాతలు నిర్ణయం తీసుకుంటే రెడీగా ఉన్న సినిమాలు కొన్ని ఓటిటి మీదకు వస్తాయేమో కానీ 90 శాతం సినిమాలు ఓటిటి మీద రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రారు.
ఆరునెలలు సినిమాలు ఆగిపోయినంత మాత్రన సినిమాను వచ్చిన కాడికి అమ్ముకుందాం అని ఏ నిర్మాత అనుకోరు. సినిమా పరిశ్రమ కూడా దీనికి ప్రిపేర్‌గా ఉండాలి. మార్కెట్లో 20 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఫైనాన్సియల్ ఇష్యూస్ అన్ని పరిశ్రమలు కున్నాయి. వాటిలో సినిమా పరిశ్రమ కూడా ఒకటిగా చూడాలి అంతే.. ఈ కష్టాలు.. బయట కష్టాలకంటే ప్రత్యేకమైనవి కావు.
థియేటర్స్ బంద్ అయితే తట్టుకునే శక్తి ఉందా..?
నేను థియేటర్స్‌ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ లీజ్‌లోనే నడుస్తున్నాయి. నాకు రెంట్ రావడం లేదు.. పర్లేదు.. మరో ఆరునెలలు థియేటర్స్ బంద్ ఉన్నా నేను మెయిన్‌టైన్ చేయగలను. సంవత్సరానికి పది లక్షల నిర్వహణ వ్యయం తట్టుకునే శక్తి థియేటర్స్ యాజమాన్యంకి ఉంది. ఎలక్ట్రిసిటీ ఛార్జిలను కమర్షియల్‌గా కాకుండా ఇండస్ట్రీయల్ ఛార్జ్‌లు వసూలు చేసేలా ప్రభుత్వాన్ని కోరుతాం. అలాగే మినిమమ్ ఛార్జ్‌ల నుండి మినహాయింపులు అడుగుతాం. ఇవన్నీ థియేటర్స్ యాజామాన్యంకు కాస్త ఊరటనిస్తాయి.
పరిశ్రమలో ఎక్కువగా ఇబ్బంది పడే కార్మికుల కోసం ప్రభుత్వం సహాయం అందిస్తుందా?
ఏ పరిశ్రమలో అయినా రోజువారీ కార్మికులు ఉంటారు. సినిమా తీస్తే అందులో 90 శాతం సినిమా కోసం అపాయింట్ చేసుకున్న వారే ఉంటారు. అంటే సినిమాలు లేవంటే వారికి పని ఉండదు. వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉంటాయి. చిరంజీవి గారు మొదలు పెట్టిన కరోనా క్రైసిస్ ఛారిటీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ కార్మికులను కాపాడుకోవటమే సినిమా పరిశ్రమ ముందు ఉన్న పెద్ద సవాల్. గవర్నమెంట్ చేసే ప్రతి సహాయం వీరికి అందేలా చూస్తాం.. ప్రభుత్వంతో కూడా చర్చించి మద్దతుగా నిలుస్తాం.
థియేటర్స్ దగ్గర మళ్ళీ అదే సందండి చూస్తామా?
నాకు పూర్తి నమ్మకం ఉంది. కరోనా లేదనే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు థియేటర్స్ దగ్గర అదే సందండి కపడుతుంది. అది ఆరు నెలలు పడుతుందా యేడాది పడుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం.. కానీ థియేటర్స్ వ్యవస్థ ఎప్పటికీ అలాగే ఉంటుంది.
లాక్ డౌన్ టైం ఎలా గడుస్తుంది..?
నేను పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాను. కరోనా ప్రభావంపై ఇండస్ట్రీ పెద్దలతో రోజూ మాట్లాడుతూనే ఉంటాను. తప్పకుండా ఈ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన రోజున మళ్లీ ఇండస్ట్రీ మరింత వేగంగా పుంజుకుంటుంది అని తెలిపారు.