ఆఫ్ఘన్ తమ వశం అయిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చి కీలక ప్రకటనలు చేశారు తాలిబన్లు. ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడిన తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్.. గతంలో తమ వైఖరికి, విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని తరిమికొట్టాం.. ఇక, అంతర్గతంగా, బయట నుంచి తాము శత్రుత్వాన్ని కోరుకోవడంలేదన్నారు. మహిళల హక్కులకు కూడా ఎలాంటి భంగం కలగనివ్వం అంటూ కీలక ప్రకటన చేశారు.
మరోవైపు.. అందరినీ క్షమించేశాం.. ఇక, ఎవరి పైనా ప్రతీకారం ఉండబోదని వ్యాఖ్యానించారు జబిహుల్లా ముజాహిద్.. ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. ప్రజల ఇళ్లలో సోదాలు గానీ వారిపై దాడులు గానీ ఉండవని స్పష్టం చేశారు..
అంతేకాదు.. తమ దేశంలోని దేశీయులకు కూడా ఎలాంటి హాని తలపెట్టబోమని ప్రకటించారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నవారు వెనక్కి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తాం.. ఎలాంటి వివక్ష చూపబోం. వైద్య, ఇతర రంగాలలో వారు పనిచేయవచ్చు నని.. మీడియాపై కూడా ఎలాంటి ఆంక్షలు ఉండభోవని వెల్లడించారు. అయితే, తాలిబన్లు తమ పంతా మార్చుకుని కొత్త తరహాలో స్టేట్‌మెంట్లు ఇస్తున్నా ప్రజలు భయాందోళనలోనే వున్నారు.