చెన్నైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చెన్నై, సైదాపేటలో తనతో పనిచేసే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగివున్న భార్యను మందలించిన పాపానికి భర్త ప్రాణాలు కోల్పోయాడు. తాగిన మైకంలో భర్తతో ఏర్పడిన గొడవ కారణంగా భార్య కత్తితో అతనిని పొడిచి చంపేసింది.
వివరాల్లోకి వెళితే, ఒడిశాకు చెందిన ప్రహ్లాద్ సర్దార్ (42) భవన నిర్మాణ కార్మికుడు. ఇతని మొదటి భార్య కొన్నేళ్ల క్రితం మరణించడంతో.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పింకీ (36)ని రెండోసారి వివాహం చేసుకున్నాడు.
వీరిద్దరూ సైదాపేటలో ఓ భవన నిర్మాణంలో పనిచేస్తున్నారు. ఇద్దరికి మద్యం సేవించే అలవాటుంది. ఈ నేపథ్యంలో ప్రహ్లాద్‌తో పనిచేసే బబ్లూ అనే వ్యక్తితో పింకీకి అక్రమ సంబంధం వున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య గొడవ జరిగేది.
పింకీని బబ్లూతో కలిసి తిరగవద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసి మద్యం సేవించారు. వీరి మధ్య బబ్లూ విషయమై గొడవ ఏర్పడింది. ఈ గొడవ ఇద్దరిపై ఒకరొకరు దాడికి పాల్పడే స్థాయికి వెళ్లింది. ప్రహ్లాద్ ఆమెను గొంతు నులిమి దాడికి పాల్పడ్డాడు. అతని దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన పింకీ.. పక్కనే వున్న కత్తితో భర్త గొంతులో పొడిచేసింది.
ఈ ఘటనలో గాయపడిన ప్రహ్లాద్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొంది ఇంటికొచ్చినా.. అతనికి గొంతులో తీవ్ర రక్తస్రావం ఏర్పడింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనిని పరిశోధించిన వైద్యులు అతను మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పింకీని అరెస్ట్ చేశారు.