Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి డేగ కళ్ళతో పహారా : చీర కట్టులో కమలా హారిస్

బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి డేగ కళ్ళతో పహారా : చీర కట్టులో కమలా హారిస్
, మంగళవారం, 19 జనవరి 2021 (10:01 IST)
అమెరికా దేశ 46వ అధ్యక్షుడుగా జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. అయితే, ఎన్నికల్లో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేని ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో వాషింగ్టన్ నగరాన్ని అమెరికా రక్షణ శాఖ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. పైగా, ప్రమాణ స్వీకారం జరిగే ప్రాంతంలో సైనికులు డేగ కళ్ళత పహారా కాస్తున్నారు. ట్రంప్ మద్దతుదారుల దాడుల హెచ్చరిక నేపథ్యంలో శ్వేతసౌథం పరిసరాలు సహా వాషింగ్టన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా సిబ్బందిని మోహరించారు.
 
విధుల్లో పాల్గొనే భద్రత సిబ్బంది నుంచే దాడుల ముప్పు ఉందన్న ముందస్తు హెచ్చరికలతో రక్షణశాఖ అధికారులు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. బైడెన్ ప్రమాణస్వీకారం సందర్భంగా భద్రతలో పాల్గొనే సిబ్బందిలో కొందరు తిరుగుబాటు చేసి దాడులకు పాల్పడే అవకాశం ఉందని, అలాగే, ట్రంప్ మద్దతుదారులు కూడా హింసకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందింది.
 
ఇటీవల కేపిటల్ భవనంపై జరిగిన దాడిలో కొందరు పోలీసులు కూడా పాల్గొనడంతో వైట్‌హౌస్ పరిసరాల్లో పూర్తిస్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 వేల మంది నేషనల్ గార్డులను వాషింగ్టన్‌లో మోహరించారు. అలాగే, వేలాదిమంది స్థానిక పోలీసులు విధుల్లో ఉన్నారు. అయితే, విపరీత భావజాలంతో వీరిలో ఎవరైనా దాడులకు దిగే అవకాశం ఉందన్న సమాచారంతో ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
 
అనుమానం వస్తే రెండు మూడుసార్లు తనిఖీ చేయాలన్న ఆదేశాలు కూడా అందాయి. ఒక్క వాషింగ్టన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. చిన్నచిన్న గుంపులుగా వచ్చి ఆయుధాలు, పేలుడు పదార్థాలతో దాడి చేసే అవకాశం ఉండడంతో వారిని ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వేరీ తెలిపారు. 
 
ఇదిలావుంటే, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతీయ మూలాలున్న ఆమె రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి దుస్తులు ధరించి ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 
 
భారతీయ అమెరికన్ అయిన కమల.. సంప్రదాయ చీరకట్టులో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. భారతీయ సంస్కృతి, వారసత్వంపై తనకు అమితమైన గౌరవం ఉందని, తన తల్లి తనను అలా పెంచారని కమల పలుమార్లు వెల్లడించారు. ఇంటి పేరుతో సంబంధం లేకుండా తాము అన్ని పండుగలను జరుపుకుంటామన్నారు.
 
కమల తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైలో పుట్టి పెరిగారు. అనంతరం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. అయినప్పటికీ భారతీయ సంప్రదాలను ఆమె ఏనాడూ విడిచిపెట్టలేదు. కమలకు కూడా చిన్ననాటి నుంచే వాటిని నేర్పించారు. ప్రమాణ స్వీకార సమయంలో ఆమె బెనారస్ పట్టుచీరలో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బిబు మొహాపాత్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

PUBG Mobile India update: పబ్ జీ ఇండియాకు ముహూర్తం ఎప్పుడు..?