భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య అణు యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో తమ దేశంలో అణు యుద్ధం అంచు వరకు వెళ్లిందని సనావుల్లా సంచలన విషయాన్ని అంగీకరించారు.
భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి అణ్వాయుధాన్ని మోసుకొస్తుందా లేదా అని అర్థం చేసుకోవడానికి తమ సైన్యానికి కేవలం 30 నుంచి 40 సెకన్ల సమయం మాత్రమే లభించిందని, అదే తమ తలరాతను నిర్దేశించిందని ఆయన ఒక పాకిస్థాన్ న్యూస్ చానెల్‌కు తెలిపారు.
భారత్ నూర్ ఖాన్ వైమానిక దళంపై బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించినపుడు దాన్ని విశ్లేషించడానికి మా సైన్యానికి కేవలం 30 - 45 సెకన్ల సమయం ఉంది. అంత తక్కువ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడమైనా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఒకవేళ మా వైపు వారు పొరపాటుగా అర్థం చేసుకునివుంటే అది ప్రపంచ వ్యాప్త అణు యుద్ధానికి దారితీసేది అని ఆయన పేర్కొన్నారు.
కాగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది భారత పర్యాటకులను హతమార్చిన విషయం తెల్సిందే. దీంతో భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా, భారత సైన్యం పాకిస్థాన్‌లోని నూర్ ఖాన్,, సర్గోధా, భోలారీ, జాకబాబాద్‌తో సహా పలు వైమానిక స్థావరాలపై దాడులు చేసి రన్‌వేలు, హ్యాంగర్లను ధ్వంసం చేసిన విషయం తెల్సిందే.