తమ తీర ప్రాంత ప్రజలను వణికిస్తున్న పెనుతుఫాను (హరికేన్ల)ను అడ్డుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ ఓ 'అద్భుతమైన' చిట్కాను తెరపైకి తెచ్చారు. పెనుతుఫానులు అమెరికా తీరాన్ని తాకటానికి ముందే వాటిపై ఓ అణుబాంబు ప్రయోగిస్తే వాటిని నివారించవచ్చు కదా అని ఆయన ఉన్నత స్థాయి సైనికాధికారులతో జరిపిన భేటీలో సూచించినట్లు ఒక మీడియా సంస్థ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
హరికేన్లు కలిగించే నష్టంపై అధికారులు వివరణ ఇచ్చినపుడు ఆయన మధ్యలో జోక్యం చేసుకుని మాట్లాడుతూ సముద్ర గర్భంలో ఆఫ్రికా తీర ప్రాంతంలో హరికేన్లు ఏర్పడే సమయంలోనే వాటిని చెల్లాచెదురు చేసేందుకు వాటిపై అణు బాంబు ప్రయోగించే అవకాశాలను పరిశీలించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.
అయితే ట్రంప్ ఇటువంటి సూచనలు తెరపైకి తేవటం ఇదే ప్రధమం కాదని అధికారులు చెబుతున్నారు. 2017లో ఒక సందర్భంలో ఆయన అధికారుల భేటీలో మాట్లాడుతూ హరికేన్లు అమెరికా తీర ప్రాంతానికి రాకుండా నివారించేందుకు సముద్ర గర్భంలోనే వాటిపై బాంబు ప్రయోగించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించినట్లు ట్రంప్ సర్కారులోని ఒక అధికారి చెప్పారు.
అయితే ఈ భేటీలో ట్రంప్ అణుబాంబు ప్రస్తావన తీసుకురాలేదని ఆయన వివరించారు. అయితే ఈ కథనంపై స్పందించేందుకు వైట్‌హౌస్ నిరాకరించింది. కాగా ఒక సీనియర్ అధికారి మాత్రం ట్రంప్ సూచించిన లక్ష్యం 'ఏమంత చెడ్డది కాద'ని అభిప్రాయపడ్డారు.
కాగా ట్రంప్ తెరపైకి తెచ్చిన ఈ సూచన కొత్తదేమీ కాదని, గతంలో ఐసెన్‌హోవర్ అధ్యక్షుడిగా వున్న 50వ దశకంలో ఒక శాస్త్రవేత్త కూడా ప్రభుత్వానికి ఈ సూచన చేశారని మీడియా తన కథనాలలో వివరించింది.