మాంచి మూడ్ లో వున్నప్పుడు చెబితేనే బాగా బుర్రకెక్కుతుందని అనుకున్నదో ఏమో, కాలిఫోర్నియాలోని సెంటర్ ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ ఓ వినూత్న ప్రచారానికి తెరలేపింది. ఈ నెల 25న వరల్డ్ కాంట్రసెప్టివ్ డేను పురస్కరించుకుని కాలిఫోర్నియాలోని 12 విద్యాసంస్థల్లో స్టూడెంట్స్‌కు కండోమ్ ప్యాకెట్లను పంచిపెట్టారు.
అంతరించిపోతున్న జీవాల చిత్రాలను ఆ కండోమ్ ప్యాకెట్లపై ముద్రిస్తూ..ప్రకృతిని కాపాడాలనే సందేశాన్ని ఇచ్చారు. కండోమ్స్ వాడండి.. ధృవపు ఎలుగబంట్లను రక్షించండీ అంటూ ఆకర్షణీయమైన నినాదాలతో ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.
గర్భనిరోధక సాధనాల విస్తృత వినియోగంతో జనాభా పెరుగుదలను నియంత్రించి ప్రకృతిని కాపాడుకోవచ్చనే అంశంపై ప్రజల్లో ఒకసారి చర్చ మొదలైతే.. అది ప్రకృతి పరిరక్షణవైపు తొలి అడుగుగా మారుతుంది అని సెంటర్ ఫర్ బయోలాజికల్ డైవర్శిటీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
అదుపు తప్పిన జనాభా పెరుగుదుల, సహజవనరుల అపరిమిత వినియోగం కారణంగానే అనేక జీవజాతులు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయని పేర్కొంది. ఈ వినూత్న ప్రచారం ప్రస్తుతం అనేక మందిని ఆకట్టుకుంటోంది.