Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ : ఓ విజ్ఞప్తి చేసిన అమెరికా!!

Advertiesment
modi - putin

వరుణ్

, మంగళవారం, 9 జులై 2024 (11:15 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనలో ఉన్నారు. దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ.. ఒక భారత ప్రధానిగా రష్యాలో మూడోసారి అధికారిక పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి అగ్రరాజ్యం అమెరికా ఓ విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, రష్యా అధ్యక్షుడు పుతిన్ వద్ద ఉక్రెయిన్ సార్వభౌమాధికారం గురించి ప్రస్తావించాలని కోరింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో సోమవారం మాట్లాడారు. వాషింగ్టన్‍‌లో నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా ఈ విధంగా స్పందించింది.
 
ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు కట్టుబడి ఉక్రెయిన్ వివాదం విషయంలో తీర్మానం చేయాలంటూ రష్యాతో చర్చలు జరిపే ప్రతి దేశాన్ని కోరుతుంటామని, ఇదే విషయాన్ని ఇప్పుడు భారత్‌కు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని మాథ్యూ మిల్లర్ అన్నారు. అమెరికాకు భారత్ ఒక వ్యూహాత్మక భాగస్వామి అని, సంపూర్ణమైన, స్పష్టమైన చర్చలు జరుపుతుంటామని మిల్లర్ అన్నారు. అయితే రష్యాతో భారత్ సంబంధాలపై తమకు ఆందోళనలు కూడా ఉన్నాయని అన్నారు. ప్రధాని మోడీ రష్యా పర్యటనలో భారత్ ఏయే అంశాలపై చర్చలు జరపనుందనేది తనకు తెలియదని అన్నారు.
 
భారత్‌తో అమెరికా బలమైన సంబంధాలను ఏర్పరచుకుందని, చైనాను కట్టడి చేయడంలో శక్తిమంతమైన భాగస్వామిగా భావించిందని, యేడాది క్రితం అధ్యక్షుడు జో బిడెన్ ప్రధాని మోడీని అమెరికా పర్యటనకు కూడా ఆహ్వానించారంటూ మిల్లర్ ప్రస్తావించారు. కాగా ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి రష్యాతో భారత్ సుదీర్ఘ ద్వైపాక్షిక సంబంధాన్ని కొనసాగిస్తోంది. 
 
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలను పాటించడానికి భారత్ నిరాకరించింది. పైగా రాయితీ లభించడంతో రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఇంధన దిగుమతులు చేసుకుంది. ఇక ఐక్యరాజ్య సమితిలోనూ వ్యూహాత్మకంగా తటస్థంగా నిలిచింది. దీంతో రష్యా వైపే భారత్ మొగ్గు చూపినట్టయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైకు భారీ వర్ష సూచన : విద్యా సంస్థలు మూసివేత... (Video)