చైనా నుంచి దిగుమతి చేసుకునే వెల్లుల్లితో దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందా? ఈ మాట వినేందుకు కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ... అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనెటర్ రిక్ స్కాట్ మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా వెల్లుల్లితో తమ దేశ జాతీయ భద్రతకు ముప్పు పొంచివుందని ఆయన హెచ్చరిక చేస్తున్నారు. పైగా, చైనా వెల్లుల్లిని వినియోగించడం దేశ ప్రలకు హానికరమని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల చైనా వెల్లుల్లి దిగుమతులపై దర్యాప్తు జరపాలని కూడా డిమాండ్ చేశారు. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ సెక్రెటరీకి ఫిర్యాదు చేశారు.
వెల్లుల్లి పెంపకంలో చైనా రైతులు అపరిశుభ్ర విధానాలు అవలంభిస్తున్నారని ఆరోపించారు. మురుగునీటిని ఎరువుగా ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా వెల్లుల్లితో పాటు చిల్డ్ గార్లిక్ ఉత్పత్తిలో చైనా ప్రపంచంలోనే అగ్రగామి కాగా అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. వెల్లుల్లి విషయంలో కొన్ని ఏళ్లుగా అమెరికా, చైనా మధ్య విభేదాలు నెలకొన్నాయి. చైనా అతి తక్కువ ధరలకు వెల్లుల్లిని తీసుకొచ్చి తమ దేశంలో కుమ్మరిస్తోందంటూ అమెరికా గతంలో ఆరోపించింది. దీనికి అడ్డుకట్టు వేసేందుకు చైనా దిగుమతులపై రకరకాల చార్జీలు కూడా బాదింది.
నిపుణుల ప్రకారం, చైనా వెల్లుల్లి దేశీ రకాల కంటే పెద్దవిగా, తెల్లగా ఉంటాయి. అయితే, చైనా వెల్లుల్లిపై అమెరికాలో ఎప్పటినుంచో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదకరమైన లోహాలు, ఇతర విషతుల్యాలతో కలుషితమైన మురుగునీటిని ఎరువుగా వాడి వెల్లుల్లి పెంచుతారన్న ఆరోపణలు ఉన్నాయి. లోహాల విషయం అటుంచితే, చెట్లకు మురుగునీరు ఎరువుగా వాడటంలో తప్పేమీ లేదని నిపుణులు చెబుతారు.