అగ్రరాజ్యం అమెరికా దేశంలోని మిసిసిపీలోని లేలాండ్ పట్టణంలో జరిగిన పూర్వ విద్యార్థులు సమ్మేళనాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం ప్రజలు ఒక చోట గుమికూడి ఉన్న సమయంలో ఓ దుండగుడు వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. మిసిసిపీ రాష్ట్ర సెనేటర్ డెరిక్ సిమ్మన్స్ కూడా ఈ కాల్పుల ఘటనను ధృవీకరించారు. ఈ కాల్పుల ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో పది మంది వరకు గాయపడ్డారని తెలిపారు.
విద్యార్థుల పూర్వ సమ్మేళనం సందర్భంగా నిర్వహించిన మ్యాచ్ అనంతరం ప్రజలు పెద్ద ఎత్తున ఒక చోట గుమికూడి ఉన్న సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. ఈ ఘటనపై గాయపడిన వారిని రాష్ట్ర రాజధాని జాక్సన్ నగరంలోని ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. అయితే, ఈ కాల్పుల ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు ఏ ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదు. అదేసమయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు లేలాండ్ పోలీస్ డిపార్టుమెంట్ వెల్లడించింది.