భారత్ నిర్వహించినటువంటి ఏశాట్ ప్రయోగాన్ని అమెరికా రక్షణ శాఖ సమర్థించింది. అంతరిక్ష ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ ఏశాట్ పరీక్షను నిర్వహించిందని, ఆ ప్రయోగం వల్ల ఎలాంటి నష్టం లేదని పెంటగాన్ తెలియజేసింది. మార్చి 27వ తేదీన దిగువ కక్ష్యలో ఉన్న ఓ ఉపగ్రహాన్ని భారత్ పేల్చివేసిన సంగతి తెలిసిందే.
ఉపరితలం నుంచి గగనతలంలోని టార్గెట్‌లను చేధించే మిస్సైల్‌తో దానిని పేల్చారు. దీంతో ప్రపంచంలో యాంటీ శాటిలైట్ మిస్సైల్ కలిగిన నాలుగవ దేశంగా భారత్ నిలిచింది. భారత్ నిర్వహించిన ఈ పరీక్షపై నాసా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అమెరికా రక్షణశాఖ తాజాగా దీనిపై స్పందించింది. అంతరిక్ష ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలోనే భారత్ ఆ పరీక్ష నిర్వహించినట్లు యూఎస్ స్ట్రాటజిక్ కమాండ్ కమాండర్ జనరల్ జాన్ హైటన్ తెలిపారు.
భారత్ తనను తాను రక్షించుకునే సత్తా ఉంది అని నిరూపించుకోవడానికి ఆ పరీక్ష చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ఉపగ్రహాన్ని పేల్చడం వల్ల సుమారు 400 వ్యర్థాలు ఏర్పడ్డాయని, వాటి వల్ల అంతరిక్ష పరిశోధనా సంస్థకు ప్రమాదం ఉందని నాసా ఆందోళన వ్యక్తం చేసింది.