Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్రమ వలసలకు అమెరికన్ల అభయం: ఆశ్రయం ఇచ్చేందుకు ఇళ్లు, అంతస్తుల నిర్మాణం

అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానంటున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు.. దేశ ప్రజల నుంచి తీవ్ర ‘ప్రతిఘటన’ ఎదురవుతోంది. ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ఉధృతంగా సాగుతున్న ఈ ప్రతిఘటన (రెసిస్టెన్స్‌) ఉద్యమం ఇప్పుడు.. తమ దేశంలో సరైన పత్రాలు లేకుండా వలసలుగా జీవిస

అక్రమ వలసలకు అమెరికన్ల అభయం: ఆశ్రయం ఇచ్చేందుకు ఇళ్లు, అంతస్తుల నిర్మాణం
హైదరాబాద్ , గురువారం, 2 మార్చి 2017 (07:28 IST)
అమెరికాలో పుట్టకపోయినా ఎన్నో ఏళ్ల కిందట వలసవచ్చి అక్కడే జీవితం గడుపుతున్న వారిలో సరైన పత్రాలు లేని వారిని గుర్తించి.. వారు శాంతియుతంగా జీవిస్తున్నా, వారిపై ఎలాంటి నేరాభియోగాలు లేకున్నా.. బలవవంతంగా వారి దేశాలకు తిప్పిపండం లక్ష్యంగా అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించడం ప్రారంభించింది. ఈ క్రమంలో చాలా మంది తమ కుటుంబాలకు, తమ పిల్లలకు దూరమవ్వాల్సిన దుస్థితి తలెత్తుతోంది. భార్యాభర్తలు విడిపోవాల్సిన పరిస్థితులూ దాపురిస్తున్నాయి. ఇటువంటి వలసవారిని ఇమిగ్రేషన్‌ అధికారుల కంట పడకుండా దాచిపెట్టి రక్షించడానికి గల మార్గాలను అన్వేషించడానికి ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌ ప్రణాళిక రచించి కృషిచేస్తోంది.
 
అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానంటున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు.. దేశ ప్రజల నుంచి తీవ్ర ‘ప్రతిఘటన’ ఎదురవుతోంది. ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ఉధృతంగా సాగుతున్న ఈ ప్రతిఘటన (రెసిస్టెన్స్‌) ఉద్యమం ఇప్పుడు.. తమ దేశంలో సరైన పత్రాలు లేకుండా వలసలుగా జీవిస్తున్న వారికి అండగా నిలుస్తోంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులను బలవంతంగా వారి దేశాలకు తిప్పిపంపే చర్యలకు ట్రంప్‌ సర్కారు ఉపక్రమించడంతో.. అటువంటి వారికి రహస్యంగా ఆశ్రయం కల్పించేందుకు నడుంకట్టింది.
 
ఆ లక్ష్యంతో వివిధ మత సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలతో ‘ర్యాపిడ్‌ యాక్షన్‌ టీం’ అనే విభాగం ఏర్పాటయింది. మూవ్‌ఆన్‌.ఆర్గ్, ద ఇన్‌డివిజిబుల్‌ గైడ్‌, రెసిస్టెన్స్‌ క్యాలెండర్‌ వంటి సంస్థలు వందలాది ఇతర ప్రగతిశీల, మానవ హక్కుల సంఘాలు ఇందులో భాగమవుతున్నాయి. అక్రమ వలసలకు ఆశ్రయం ఇవ్వడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమైనా సరే.. తాము మంచి పని చేస్తున్నామని, దేనికైనా సిద్ధమని వారు తేల్చిచెప్తున్నారు.
 
ఈ నేపథ్యంలో సరైన పత్రాలు లేని వలసలు దాక్కునేందుకు వీలుగా కొత్త ఇళ్లు కొనడం, తమ సొంత ఇళ్ల మీద అంతస్తులు నిర్మించడం. ఎందుకంటే.. ప్రయివేటు ఇళ్లలోకి ప్రవేశించాలన్నా, సోదాలు చేయాలన్నా ఐసీఈ లేదా పోలీసు విభాగాల వారికి వారెంట్లు అవసరం. ఆ వారెంట్లు తీసుకుని వచ్చేలోగా ఆ ఇంట్లో తలదాచుకున్న వలసలను వేరొక చోటుకు తరలించేందుకు సమయం కూడా లభిస్తుంది. 
 
కానీ.. సరైన పత్రాలు లేని వలసలకు ఆశ్రయం ఇచ్చినట్లు అధికారులు గుర్తిస్తే.. ఈ కార్యకర్తలు కఠిన జరిమానాలు, జైలుశిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘అలా అక్రమ వలసలకు ఆశ్రయం ఇవ్వడం మనుషులను అక్రమ రవాణా చేయడంతో సమానం. చట్ట రీత్యా నేరం. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని న్యాయనిపుణులు చెప్తున్నారు. అయితే.. ఆ విషయం తమకు పూర్తిగా తెలుసునని, అయినా భయపడబోమని లాస్‌ ఏంజెలెస్‌కు చెందిన పాస్టర్‌ అదా వాలియెంటి పేర్కొన్నారు. ‘ఇది సరైన పని అని నమ్మి మేం చేస్తున్నాం’ అని ఉద్ఘాటించారు. 
 
దక్షిణ కాలిఫోర్నియాలో వేలాది మంది వలసలకు (సరైన పత్రాలు లేని వారికి) ఆశ్రయం ఇవ్వడం లక్ష్యంగా లాస్‌ ఏంజెలెస్‌ మత పెద్దలు ఒక వ్యవస్థగా ఏర్పడి కొత్తగా ఇళ్లు కొంటూ, వాటిపైన మళ్లీ అంతస్తులు కూడా నిర్మిస్తున్నారు. వారిలో పాస్టర్‌ అదా వాలియెంటి ఒకరు. ఒక యూదు వ్యక్తి తన ఇంట్లో అదనంగా ఉన్న పడకగదిని ఇలాంటి వలస వారికి కేటాయించారు. ‘యూదులు నిజంగా ప్రమాదంలో ఉన్నపుడు తమ తలుపులు తెరిచి ఆదుకుని తాము కూడా ముప్పును ఎదుర్కొన్న వారి గురించీ, అలా చేయని వారి గురించీ ఆలోచించకుండా ఉండటం ఒక యూదుకు చాలా కష్టం. అలా తలుపులు తెరిచి ఆదుకున్న వారిలా మేమూ ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతా మీరు చేసి మమ్మల్ని అంటే న్యాయమా బాబుగారూ? టీటీడీపీ నేతల గుర్రు