భారత పారా బ్యాడ్మింటన్ ప్లేయర్లు తృటిలో బయటపడ్డారు. ఉగాండాలో టోర్నీ ఆడేందుకు కంపాలలో బస చేస్తున్న మన షట్లర్ల హోటల్‌కు సమీపంలో మంగళవారం వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. సరిగ్గా వంద మీటర్ల దూరంలో ఒక్కసారిగా బాంబులు పేలడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే జరిగిన ఘటనపై పారా బ్యాడ్మింటన్ ఇండియా ట్విట్టర్‌లో స్పందించింది. 'భారత బృందం సురక్షితంగా ఉంది. షట్లర్లు ఉంటున్న హోటల్‌కు సరిగ్గా 100 మీటర్ల దూరంలో పేలుళ్లు జరిగాయి. భయపడాల్సిన అవసరమేమి లేదు.
నిర్వాహకులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు' అని కోచ్ వికాస్ కన్నా ట్వీట్ చేశాడు. టోక్యో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ ఉగాండా పారా బ్యాడ్మింటన్ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు.