Publish Date: Sat, 23 May 2026 (10:29 IST)
Updated Date: Sat, 23 May 2026 (10:29 IST)
ఇరాన్‌పై మరోమారు భీకర దాడులు జరపాలని అమెరికా భావిస్తోంది. అమెరికా - ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి ఓ క్షణంలోనైనా ప్రకటన వెలువడవచ్చని, ఒకవేళ ఈ ఒప్పందం ఖరారు కాకపోతే మాత్రం ఇరాన్‌పై దాడులతో విరుచకుపడాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈమేరకు అమెరికా అధికారులను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ట్రంప్ శుక్రవారం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌తోపాటు కీలక అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఇరాన్‌పై తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యక్షుడు వారితో చర్చించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో చర్చలు విఫలమైతే.. వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించే విషయం గురించి వారు మాట్లాడుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
అయితే, దాడులకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాయి. ఈ సమావేశం అనంతరం వైట్‌హౌస్ అధ్యక్షుడి కార్యక్రమాలకు సంబంధించి కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మెమోరియల్ డే సందర్భంగా న్యూజెర్సీకి వెళ్లాలని ట్రంప్ తొలుత నిర్ణయించుకున్నారు. అయితే, దాన్ని రద్దు చేసుకున్న ఆయన వైట్‌హౌస్‌లోనే ఉండనున్నారు. ఇక, అమెరికాకు చెందిన పలువురు సైనిక, నిఘా అధికారులు కూడా తమ ప్రణాళికలను రద్దు చేసుకున్నారు.
ఇరాన్‌పై దాడులకు అమెరికా సన్నద్ధమవుతుందనే వార్తల నేపథ్యంలోనే ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహానికి హాజరుకావడం లేదన్నారు. ట్రంప్ జూనియర్, బెట్టినా ఆండర్సన్‌ల పెళ్లి చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందంటూ అధ్యక్షుడు ట్రూత్‌సోషల్‌లో పోస్టు పెట్టారు. అయితే, ప్రభుత్వ సంబంధిత పరిస్థితుల వల్ల తాను అక్కడికి వెళ్లలేకపోతున్నానని తెలిపారు. ఈ కీలక సమయంలో తాను వైట్‌హౌస్‌లోనే ఉండటం అత్యంత ముఖ్యమని భావిస్తున్నట్లు వెల్లడించారు.