Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇద్దరు భారతీయుల తలలు నరకమని ఆదేశించిన సౌదీ... ఎందుకో తెలుసా?

ఇద్దరు భారతీయుల తలలు నరకమని ఆదేశించిన సౌదీ... ఎందుకో తెలుసా?
, బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:35 IST)
హత్య కేసులో నిందితులుగా నిర్ధారించబడిన ఇద్దరు భారతీయుల తలలు నరకమని తీర్పునిచ్చింది సౌదీ న్యాయస్థానం. కోర్టు ఆదేశాలతో వీరికి మరణదండన విధించాలని నిర్ణయించిన అధికారులు ఫిబ్రవరి 28న దోషుల తలల నరికి న్యాయస్థానం తీర్పును అమలుచేశారు. భారతీయులకు మరణదండన విధించిన విషయాన్ని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. సౌదీ చట్టాల ప్రకారం వారి మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం లేదని వెల్లడించింది. 
 
వివరాల్లోకి వెళ్తే ఇమాముద్దీన్ అనే వ్యక్తి హత్య కేసులో పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన సత్వీందర్ కుమార్, లూధియానాకు చెందిన హర్జీత్ సింగ్‌లు నిందితులుగా ఉన్నారు. డిసెంబరు 2015లో సత్వీందర్, హర్జీత్‌లు ఇమాముద్దీన్‌‌ను హత్యచేసి అతడి వద్ద డబ్బు దోచుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు నిందితులిద్దరూ మద్యం సేవించి దోచుకున్న సొత్తు కోసం గొడపడ్డారు. 
 
ఆ సమయంలో వారిని గమనించిన సౌదీ పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని, తమ దేశం నుంచి పంపే ఏర్పాట్లు చేస్తుండగా ఇమాముద్దీన్ హత్య కేసుతో వీరికి సంబంధం ఉన్నట్లు తెలిసింది. దీంతో వారిపై కేసు నమోదుచేసి వారిని రియాద్ జైలుకు తరలించారు. సత్వీందర్ భార్య సీమా రాణి విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేయడంతో అక్కడ భారత రాయబార కార్యాలయంలోని అధికారులు స్పందించారు. 
 
2017 మే నెలలో జరిగిన కోర్టు విచారణకు భారత విదేశాంగ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సమయంలో ఇద్దరు నిందితులూ నేరం చేసినట్టు అంగీకరించడంతో వారికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
 
అయితే వీరికి ఈ ఏడాది ఫిబ్రవరి 28న శిక్ష అమలు చేసినట్లు, దీనిపై రియాద్‌లోని ఇండియన్ ఎంబసీకి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని విదేశాంగ శాఖ తెలిపింది. జైలులో ఉన్న వీరి పరిస్థితి గురించి తెలుసుకోడానికి ఎంబసీ అధికారులు రియాద్‌కు వెళ్లారని, అయితే అప్పటికే వారికి మరణశిక్ష అమలు చేసినట్లు రాయబార కార్యాలయ డైరెక్టర్ ప్రకాశ్ చంద్ పేర్కొన్నారు. 
 
కనీసం వారి మృతదేహాలనైనా అప్పగించాలని పలుమార్లు సౌదీ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ మరణదండన విధించబడిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు అక్కడి చట్టాలు అంగీకరించబోవని వారు స్పష్టంచేసినట్లు తెలియజేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా పార్టీ గెలిస్తే మీకు మాంసం ఫ్రీ.. సగం ధరకే మద్యం..