ఇటీవల బీహార్ రాష్ట్రంలో మెదడువాపు వ్యాధి బారినపడి సుమారుగా వందమందికిపైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రిలో ఎలాంటి చలనం లేదు. పైగా, అర్థంపర్థంలేని కామెంట్స్. ఫలితంగా బీహార్‌లో ఇప్పటికీ మరణమృదంగం కొనసాగుతోంది.
కానీ, ట్యూనీషియా దేశంలో పరిస్థితి ఇందుకు విరుద్ధం. కేవలం 11 మంది చిన్నారులు చనిపోయినందుకే ఆ దేశ ఆరోగ్య శాఖామంత్రి తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. అంతేనా, ఈ మరణాలపై విచారణకు సైతం ఆదేశించండం జరిగింది.
ట్యూనీషియా దేశంలోని రబ్టా క్లినిక్‌లో బ్లడ్ ఇన్ఫెక్షన్ కారణంగా 24 గంటల వ్యవధిలో 11 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఫలితంగా ఆ దేశ హెల్త్ మినిస్టర్ అబ్దుల్ రవుఫ్ ఎల్ షరీఫ్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే, చిన్నారుల మృత్యువాతపై ఆరోగ్య శాఖ సమగ్ర న్యాయ విచారణకు ఆదేశించింది. ఇందులో వైద్య సిబ్బంది అలసత్వం కారణంగానే చిన్నారులు చనిపోయారని తేలినపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.