Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనాను ధిక్కరించిన లిథువేనియా

చైనాను ధిక్కరించిన లిథువేనియా
, ఆదివారం, 23 మే 2021 (13:22 IST)
చైనా ప్రదర్శించే స్నేహంలో నిజాయితీ లేదని రాన్రానూ ఒక్కొక్క దేశం గుర్తిస్తున్నాయి. స్నేహం పేరుతో దగ్గరై గూఢచర్యం చేస్తున్నట్లు, తమ దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలుసుకుంటున్నాయి. కోవిడ్ మహమ్మారిని సైతం తన ప్రాభవాన్ని, తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి చైనా ఉపయోగించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 
 
దీంతో చైనాకు దూరమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదేబాటలో 28 లక్షల జనాభాగల లిథువేనియా పయనించింది. చైనా ఏర్పాటుచేసిన 17+1 కూటమి నుంచి వైదొలగింది. యూరోపు దేశాలు సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చింది.  
 
లిథువేనియా జనాభా 28 లక్షల కన్నా తక్కువే. చైనా ఏర్పాటు చేసిన సెంట్రల్, ఈస్టర్న్ యూరోపియన్ దేశాలతో 17+1 గ్రూపు నుంచి వైదొలగుతున్నట్లు శనివారం ప్రకటించింది. చైనా 2012లో ఏర్పాటు చేసిన ఈ కూటమి నుంచి బయటకు వచ్చేయాలని ఇతర దేశాలను లిథువేనియా కోరింది. 
 
లిథువేనియా విదేశాంగ మంత్రి గాబ్రియెలియుస్ లండ్స్‌బెర్గిస్ శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, లిథువేనియా ఇక ఎంత మాత్రం తనను తాను 17+1 గ్రూపు సభ్యురాలిగా పరిగణించబోదని చెప్పారు. 
 
దీనిలో భాగస్వామి కాబోదన్నారు. యూరోపియన్ యూనియన్ దృష్టితో చూసినపుడు ఈ గ్రూపు ‘‘విభజన’’ సృష్టిస్తోందని చెప్పారు. 27+1 గ్రూపును అనుసరించాలన్నారు. యూరోపు దేశాలన్నీ సమైక్యంగా ఉంటేనే బలంగా ఉండవచ్చునని తెలిపారు. 
 
చాలా ఆలోచించిన తర్వాత మాత్రమే లిథువేనియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలోని చాలా దేశాల మాదిరిగానే లిథువేనియా కూడా చైనాను చాలా కాలం నుంచి అనుమానిస్తోంది. చైనా గూఢచర్యం తమ దేశ భద్రతకు విఘాతం కలిగిస్తుందనే విషయాన్ని 2019లో లిథువేనియా గుర్తించింది. 
 
రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాతీయ ముప్పు అంచనా నివేదిక, 2019లో లిథువేనియా, నాటో, యూరోపియన్ యూనియన్ దేశాల్లో చైనా ఆర్థిక, రాజకీయ ఆకాంక్షలు పెరుగుతున్నాయని పేర్కొంది. చైనీస్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ సర్వీసెస్ కార్యకలాపాలు అత్యంత వేగంగా జరుగుతున్నట్లు పేర్కొంది.  
 
ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన జాతీయ ముప్పు అంచనా నివేదికలో కూడా ఇదేవిధమైన ఆందోళనను వ్యక్తం చేసింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో తన సొంత ప్రతిష్ఠను పెంచుకోవడానికి, ప్రత్యర్థులను అభాసుపాలు చేయడానికి చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం : పార్లమెంట్ రద్దు