చైనాకు చెందిన టిక్ టాక్‌కు అమెకాలో కాస్తంత ఊరట లభించింది. దీనిపై విధించిన నిషేధం అమలును తాత్కాలికంగా వారం రోజుల పాటు నిలిపివేశారు. అమెరికాలో తన కార్యకలాపాలు కొనసాగించేందుకు టిక్ టాక్ యాజమాన్య సంస్థ బైట్ డ్యాన్స్... ఒరాకిల్, వాల్ మార్ట్ వంటి అమెరికా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడమే అందుకు కారణమని తెలుస్తోంది.
ఈ ఒప్పందానికి వైట్ హౌస్ మద్దతు ఉంటుందని అధ్యక్షుడు ట్రంప్ కూడా సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ఈ మూడు సంస్థల కలయికతో అమెరికాలో మరో పాతికవేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు ఎలాంటి ఢోకా ఉండబోదని ట్రంప్ భరోసా ఇస్తున్నారు.
కాగా, బైట్ డ్యాన్స్, ఒరాకిల్, వాల్‌మార్ట్ కలిసి ఏర్పాటు చేయబోయే సంస్థను టిక్ టాక్ గ్లోబల్‌గా పిలవనున్నారు. దీని కేంద్ర కార్యాలయం టెక్సాస్‌లో ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. టిక్ టాక్ గ్లోబల్ కార్యరూపం దాల్చితే అమెరికాలో టిక్ టాక్‌పై నిషేధం పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది.
నిజానికి అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. తాజాగా అమెరికా ప్రభుత్వం చైనాకు చెందిన టిక్‌టాక్, వీ చాట్ యాప్‌లపై నిషేధం విధించడంతో చైనా మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
తమ కంపెనీలపై అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని, అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని చైనా వాణిజ్య శాఖ మండిపడింది. ఎలాంటి ఆధారాలు, అవసరం లేకుండానే రెండు సంస్థలను అణచివేసేందుకు అమెరికా తన అధికారాన్ని వాడుకుంటోందని విమర్శించింది.
అమెరికా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళితే దీటుగా స్పందిస్తామని, తమ దేశ కంపెనీల ప్రయోజనాలు కాపాడేందుకు కఠిన చర్యలకు దిగుతామని హెచ్చరించింది. అమెరికా ఇకనైనా అంతర్జాతీయ నియమాలను పాటించాలని, నైతిక విలువలు అనుసరిస్తూ పారదర్శకంగా కార్యకలాపాలు జరపాలని చైనా వాణిజ్య శాఖ హితవు పలికింది. అయితే, తాజా ఒప్పందంతో చైనా కాస్తంత శాంతించే అవకాశం ఉంది.