జపాన్‌లోని యోకహోమా నగర తీరంలో ఆగిన డైమండ్ ప్రిన్‌సెస్ నౌక నుంచి సుమారు 400 మంది అమెరికన్లు బయటికి వచ్చారు. ఆ నౌకలో ఉన్న ప్రయాణికులకు కరోనా వైరస్ సోకి ఉంటుందన్న అనుమానాంతో కొన్ని రోజుల నుంచి ఆ నౌకను క్వారెంటైన్ చేసిన విషయం తెలిసిందే.
అయితే అమెరికాకు చెందిన రెండు విమానాలు సోమవారం తమ దేశస్థులను తీసుకువెళ్లాయి. కాలిఫోర్నియాలోని ఎయిర్‌బేస్‌లో ఓ ప్లేన్ దిగినట్లు సమాచారం. అక్కడ 14 రోజుల పాటు వారిని వేరుగా ఉంచనున్నారు.
కాగా, 3700 మంది ప్రయాణికులు ఉన్న డైమండ్ ప్రిన్‌సెస్ షిప్‌ను ఈనెల 3వ తేదీ నుంచి క్వారెంటైన్ చేశారు. కరోనా వల్ల ఇప్పటి వరకు 1672 మంది మరణించారు. 71 వేల వైరస్ సోకిన కేసులు నమోదు అయ్యాయి.
మరోవైపు, డైమండ్ ప్రిన్‌సెస్ నౌకలో ఉన్న ప్రయాణికులకు సుమారు 2వేల ఐఫోన్లను జపాన్ ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. లైన్ యాప్ ఉన్న ఫోన్లను ప్రయాణికులకు ఇచ్చారు. కరోనా వైరస్ సోకిన ప్రయాణికులు నౌకలో ఉన్న కారణంగా.. ఆ నౌకను గత కొన్ని రోజుల నుంచి క్వారెంటైన్ చేశారు.
అయితే ప్రయాణికుల క్షేమ సమాచారం తెలుసుకునేందుకు ఐఫోన్లను పంపిణీ చేశారు. ఫోన్లలో ఉన్న లైన్ యాప్ ద్వారా.. ప్రయాణికులు మెడికల్ ప్రొఫెషనల్స్‌తో టచ్‌లో ఉండవచ్చు. దాని ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని, చికిత్స పొందవచ్చు.
సైకాలజిస్ట్‌ల సలహాలు కూడా తీసుకునేందుకు జపాన్ ప్రభుత్వం ఆ ఫోన్లను అందజేసింది. జపాన్ బయట రిజిస్టర్ చేసుకున్న ఫోన్ల నుంచి లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం వీలు కాదు. అందుకే జపాన్ ప్రభుత్వమే ప్రత్యేకంగా 2వేల ఫోన్లను ప్రయాణికులకు అందజేసినట్లు తెలుస్తోంది.