చైనాతో తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టకుండానే.. రెండో దఫాపై సంకేతాలిచ్చారు ట్రంప్. త్వరలోనే చర్చలు ప్రారంభమవుతాయని.. కానీ ఫలితాల కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాలన్నారు.
వాణిజ్య యుద్ధంతో దాదాపు రెండేళ్ల పాటు వార్తల్లో నిలిచిన అమెరికా-చైనా.. ఇప్పుడు స్నేహగీతం పాడుతునట్టు కనిపిస్తోంది. ఎన్నో చర్చలు, సమావేశాల తర్వాత ఈ నెల 15న ఇరు దేశాల మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసే అవకాశముందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
అది పూర్తి కాక ముందే రెండో దశ ఒప్పందంపై సంకేతాలిచ్చారు ట్రంప్. ఆలస్యం కాకుండానే రెండో దశ ఒప్పందం దిశగా చర్చలు ప్రారంభమవుతాయని అగ్రరాజ్య అధ్యక్షుడు స్పష్టం చేశారు. కానీ ఈ చర్చల ఫలితాల కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు వేచి చూడాలన్నారు.