Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'లైఫ్ గోల్' కొట్టిన థాయ్ బాలలు... గుహలో నుంచి సురక్షితంగా తరలింపు

థాయ్‌లాండ్ బాలలు మృత్యువును గెలిచారు. గత 18 రోజులుగా కొండగుహలో చిమ్మచీకటిలో దారితెన్నూ తెలియక దిక్కుతోచని స్థితిలో ఆశలు చాలించుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన బాలలు ఎట్టకేలకు మళ్లీ వెలుగును చూశారు.

Advertiesment
Thai cave rescue
, బుధవారం, 11 జులై 2018 (12:47 IST)
థాయ్‌లాండ్ బాలలు మృత్యువును గెలిచారు. గత 18 రోజులుగా కొండగుహలో చిమ్మచీకటిలో దారితెన్నూ తెలియక దిక్కుతోచని స్థితిలో ఆశలు చాలించుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన బాలలు ఎట్టకేలకు మళ్లీ వెలుగును చూశారు. తమ ఫుట్‌బాల్ కోచ్‌తోపాటు గుహలో చిక్కుకుపోయిన 12 మంది బాలలను అధికారులు వెలుపలికి తీసుకొచ్చారు. నిపుణులైన విదేశీ డైవర్లు, థాయ్‌నౌకా దళ సిబ్బంది మంగళవారం గుహ లోపలికి వెళ్లి అక్కడ మిగిలి ఉన్న నలుగురు బాలలు, 25 యేళ్ళ వయస్సున్న వారి కోచ్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి.. వారికి లైఫ్ గోల్ ఇచ్చారు.
 
ఈ గుహలో చిక్కుకున్న బాలలంతా సురక్షితంగా బయటపడ్డారన్న వార్త తెలియగానే సామాజిక మాధ్యమాలు హర్షాతిరేకాలతో హోరెత్తాయి. గుహ నుంచి బాలలను వెలికితీసే రెస్క్యూ ఆపరేషన్‌ను ఆదివారం ప్రారంభించిన అధికారులు మొదటి రోజు నలుగురిని, మరుసటి రోజు మరో నలుగురిని తీసుకొచ్చారు. గత రెండు రోజుల అనుభవం మూడోరోజు పనిని మరింత సునాయాసం చేసిందని ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహిస్తున్న అధికారి నరోంగ్‌సక్ ఒసొట్టనకార్న్ వెల్లడించారు. 
 
కాగా, వైల్డ్‌బోర్స్ అనే ఫుట్‌బాల్ జట్టుకు చెందిన 12 మంది బాలలు, వారి కోచ్ గత నెల 23న థాయ్‌లాండ్, మయన్మార్ సరిహద్దులోని తామ్ లువాంగ్ గుహలోపలికి వెళ్లి చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 11 నుంచి 16 యేళ్ళ మధ్యనున్న బాలలు ఫుట్‌బాల్ ప్రాక్టీసు అనంతరం గుహను అన్వేషించేందుకు వెళ్లారు. ఇంతలో భారీ వర్షం రావడంతో గుహలోపలికి వరదనీరు వచ్చి చేరింది. దీంతో వారు అక్కడే ఉండిపోయారు. తొమ్మిది రోజుల అనంతరం వారిని వెతుకుతూ వెళ్లిన బ్రిటన్ డైవర్లకు నాలుగు కిలోమీటర్ల లోపల ఓ మట్టి దిబ్బపై వారు కనిపించారు. ఈ విషయం థాయ్ అధికారులకు తెలుపడంతో వీరిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. 
 
మరోవైపు, ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగియడంతో ప్రపంచం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. బాలలందరూ సురక్షితంగా గుహ నుంచి బయటకు వచ్చారని తెలియగానే ప్రపంచ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే డైవర్ల సేవలను కొనియాడుతూ వారిని అభినందించారు. బాలలను రక్షించిన డైవర్లలో అత్యధికులు బ్రిటన్‌కు చెందిన వారేనన్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయనెల్ మెస్సీ, టెక్ గురు ఎలాన్ మస్క్ హర్షం వ్యక్తంచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరిపూర్ణానందపై పోలీసులు నగర బహిష్కరణకు అసలు కారణాలేంటి?