Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ శ‌క్ర‌వారం న‌మాజ్ త‌ర్వాత‌... ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన తాలిబన్లు!

ఈ శ‌క్ర‌వారం న‌మాజ్ త‌ర్వాత‌... ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన తాలిబన్లు!
విజయవాడ , శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (11:59 IST)
ఆఫ్ఘనిస్థాన్‌లో పాలనా వ్యవహారాల ప‌గ్గాలు చేపట్టేందుకు తాలిబ‌న్లు యత్నాలను ముమ్మరం చేశారు. దీనిపై కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు తాలిబన్‌ వర్గాలు తెలిపాయి. శుక్ర‌వారం ప్రార్థనలు ముగిసిన తర్వాత, ఆఫ్ఘన్‌లో నూతన ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామ‌ని తాలిబాన్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అధ్యక్ష భవనంలో కార్యక్రమం ఉంటుందని తాలిబన్ల అధికార ప్రతినిధులు తెలిపారు.
 
 గత సర్కారులోని కొందరు నేతలు, ఇతర ప్రముఖులతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్‌ కూర్పుపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. తాలిబన్‌ సర్కారు ఏర్పడ్డ తర్వాత రోజువారీ పరిపాలనా వ్యవహారాలను… రాజకీయ విభాగపు అగ్రనేత అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ నాయకత్వంలోని ప్రత్యేక మండలి చూసుకునే అవకాశముంది.
 
పరిపాలన కోసం ఎలాంటి మండలి ఏర్పాటయినా,  దానికి అధినాయకుడిగా తాలిబన్‌ సుప్రీం లీడర్‌ హైబతుల్లా అఖుంద్‌జాదా ఉండనున్నారు. తాలిబన్‌ ఆధీనంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుండటతో, కాందహార్‌లో ఉన్న హైబతుల్లా అఖుంద్‌జాదాతోపాటు బరాదర్ అజ్ఞాతం వీడనున్నారు. రెండు దశాబ్దాల అనంతరం ఆఫ్ఘన్‌ నుంచి అమెరికా బలగాలు పూర్తిస్థాయిలో వెళ్లిపోయాయి. 
 
ఇప్పటికీ, కొరకరాని కొయ్యగా ఉన్న పంజ్‌షీర్‌ను ఎలాగైనా ఆక్రమించుకోవాలని తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆ ప్రావిన్సుపై దాడికి దిగినప్పుడు ఎదురుదెబ్బ తగలడంతో, తాజాగా చర్చల బాట పట్టారు. పర్వాన్‌ ప్రాంతంలో పంజ్‌షీర్‌ నేతలు, పలువురు ఇతర గిరిజన తెగల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఆయుధాలు వీడి తమతో చేతులు కలపాలని పంజ్‌షీర్‌ ఫైటర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాను రానంటూనే, వ‌చ్చిన ర‌కుల్... ఈడీ విచారణకు హాజరు!