ఆఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని తమకు ఎదురే లేదంటున్న తాలిబన్లకు షాక్‌లు కూడా తగులుతున్నాయి.. తాజాగా, జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆఫ్ఘన్‌కు డెవలప్‌మెంట్ సాయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ విషయాన్ని జర్మన్ డెవలప్‌మెంట్ మంత్రి గెర్డ్ ముల్లర్ రినిష్ వెల్లడించారు.. డెవలప్‌మెంట్ ఫండ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్న ఆయన.. ఇదే సమయంలో.. అక్కడినుంచి వచ్చేయాలని భావిస్తున్న స్థానిక అభివృద్ధి అధికారులు, ఎన్‌జీవోలకు చెందిన సభ్యులను దేశానికి రప్పించే చర్యలు మాత్రం కొనసాగిస్తామని తెలిపారు.
అయితే, ఏడాదికి 430 మిలియన్ యూరోలు (506 మిలియన్ డాలర్లు) ఆఫ్ఘనిస్థాన్‌కు అందించేందుకు గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జర్మనీ.. దీంతో అతిపెద్ద దాతలలో ఒకటిగా నిలిచింది. ఈ సాయాన్ని స్థానిక పోలీసు బలగాల శిక్షణకు, న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి, అలాగే మహిళల హక్కుల రక్షణ, అవినీతిపై పోరుకు ఉపయోగించాడానికి ఉద్దేశించబడింది.
కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. ఆ దేశాధ్యక్షుడు దేశాన్ని విడిచి పారిపోగా.. ఆఫ్గాన్ తాలిబన్ల పూర్తి నియంత్రణలోకి వెళ్లిపోయింది.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది జర్మనీ.