ప్రపంచంలోనే తొలి వింత వైద్య కేసు నమోదైంది. కనురెప్పల కింద దాగివున్న తేనెటీగలను వైద్యులు గుర్తించారు. పైగా ఈ తేనెటీగలు మహిళ కన్నీటిని తాగేస్తూ బతికివున్నాయి. ఈ వింత వైద్య కేసు తైవాన్‌లో వెలుగుచూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
తైవాన్‌కు చెందిన 29 యేళ్ళ మహిళకు కంటిలో విపరీతమైన నొప్పి వచ్చింది. ఈ నొప్పిని భరించలేక పోయింది. పైగా, కనురెప్ప బూరెలా ఉబ్బిపోయింది. కంటి నుంచి నీరు దారగా కారడం జరిగింది. దీంతో భయంతో వణికిపోయిన కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ మహిళ నేత్రాన్ని పరిశీలించిన వైద్యులు.. కంటిలో తేనెటీగలు ఉన్నట్టు గుర్తించారు.
మైక్రోస్కోప్ ఆధారంగా కనుగుడ్డు పొర కిందిభాగంలో నాలుగు చిన్న తేనెటీగలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కంటి పైపొర కింది భాగంలో ఉన్న నాలుగు తేనెటీగలు ఆమె కంటిలోని తేమను, ఉప్పుతో కూడిన కన్నీళ్లను తాగుతున్నట్టు వైద్యులు గుర్తించారు.
ఇలాంటి కేసు.. ప్రపంచంలోనే తొలి వింత కేసు అంటూ వైద్యులు వర్ణించారు. అదృష్టం ఏమిటంటే.. మహిళ తన కళ్లను రుద్దడం నలపడం చేయలేదని, లేదంటే ఆ ఇన్ఫెక్షన్.. కనుగుడ్డుపై శుక్లమండలం దెబ్బతిని చూపు కోల్పోయే ప్రమాదం ఉండేదని వైద్యులు చెప్పారు.
ఈ నాలుగు తేనెటీగలు కంటిలో స్రవించే నీటిని తాగేస్తున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆ మహిళ కంటికి చికిత్స చేసి బతికివున్న తేనెటీగలను వెలికి తీశారు. ప్రస్తుతం ఆ మహిళ కోలుకుంటోందని వైద్యులు చెప్పారు.
ఇంతకీ ఆ మహిళ కంటిలోని తేనెటీగలు ఎలా వెళ్లాయన్న అంశంపై కుటుంబ సభ్యులు స్పందిస్తూ, ఇటీవల తమ బంధువుకు సంబంధించిన సమాధిని శుభ్రం చేస్తున్న సమయంలో కొన్ని తేనెటీగలు ఎగిరాయని వాటిలో కొన్ని కంటిలోకి వెళ్లి ఉండొచ్చని వెల్లడించారు.
అప్పటినుంచి మహిళ అసౌకర్యంగా ఫీలవుతుండేదని, కంట్లో నుంచి తరచూ నీళ్లు కారుతుండేవని తెలిపింది. అయితే.. తొలుత కంట్లో ఏదో నలుసు, ఇసుక పడి ఉండొచ్చునని భావించి.. ముందుగా నీళ్లతో కంటిని శుభ్రం చేయగా, అప్పటికీ కంటి నొప్పి తగ్గక పోవడంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లినట్టు చెప్పారు.