మానవత్వం మంటగలిసిపోయింది. కరోనా వంటి రోగాలు వచ్చినా.. మనిషిలో మానవత్వం లేకుండా పోయింది. తాజాగా ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేసే వ్యక్తి చనిపోతే.. సదరు సూపర్ మార్కెట్ యాజమాన్యం మాత్రం అస్సలు పట్టించుకోలేదు.
అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందివ్వకుండా శవం మీద గొడుగులు కప్పి పేలాలు ఏరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ సూపర్ మార్కెట్ నిర్వాకం బయటి ప్రపంచానికి తెలిసింది. దీంతో యాజమాన్యం తాము చేసిన పనికి క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారంలో బ్రెజిల్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని కర్రెఫోర్ సూపర్ మార్కెట్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న మోయిసెస్ సంతోస్ కవాల్కంటే అనే ఉద్యోగి గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. అయితే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా స్టోర్‌లోనే అత్యవసర చికిత్స అందించారు. ఆ చికిత్స సరిపోకపోయేసరికి అతను మృతిచెందాడు. అతను మరణించినా.. యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోలేదు.
అతని కుటుంబానికి సమాచారం అందివ్వలేదు. అతని చావుతో తమ వ్యాపారం ఎక్కడ ఆగిపోతుందోనని శవాన్ని ఒక మూలన పెట్టి చుట్టూ గొడుగులు, డబ్బాలు కప్పారు. ఈ విషయం తెలిసిన కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి కాస్తా వైరల్ కావడంతో ఆ సూపర్ మార్కెట్ యాజమాన్యంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు.