Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంకలో ఆహార సంక్షోభం : కిలో కందిపప్పు రూ.310

Advertiesment
Sri Lanka
, బుధవారం, 15 సెప్టెంబరు 2021 (08:57 IST)
శ్రీలంకలో ఆహార సంక్షోభం తారా స్థాయికి చేరింది. లంక ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ మొరపెట్టుకుంటున్నారు. ప్రపంచ దేశాలు తమ క్షుద్బాధను తీర్చాలంటూ కోరుతున్నారు. ఈ కారణంగా శ్రీలంకలో నిత్యావసర వస్తు ధరలు ఆకాశానికంటాయి. కిలో కందిపప్పు ధర రూ.310గా పలుకుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
లంకలో ఆహార సంక్షోభం తలెత్తడానికి అనేక కారణాలు లేకపోలేదు. మొదటిది విదేశీ పైసల నిల్వలు పడిపోవడం. రెండోది.. సేంద్రియ సాగును కంపల్సరీ చేయడం. మూడోది.. విదేశాల నుంచి తిండి గింజలను, పాల పొడులను, పప్పు ధాన్యాల దిగుమతులను నిషేధించడం. నాలుగోది.. ఏటికేడు అప్పుల కొండ పెరిగిపోతుండడం. ఇవన్నీ కలిసి శ్రీలంకలో తిండికి తిప్పలను తెచ్చిపెట్టేశాయి. 
 
ముఖ్యంగా, బియ్యం, చక్కెర, పాలపొడి, పప్పులు, చిరుధాన్యాలు, తృణధాన్యాలకు కొరత భారీగా పెరిగింది. పప్పులు, చక్కెరల ధరలు రెట్టింపయ్యాయి. కొందరు వ్యాపారులు దానినే అదనుగా చేసుకుని తిండిపదార్థాలను బ్లాక్​ చేసేశారు. ఇంత జరుగుతున్నా తిండి సంక్షోభం ఏమీ లేదంటూనే.. గత నెల 30న దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీని ఆ దేశాధ్యక్షుడు గోటబయా రాజపక్స ప్రకటించారు. 
 
మరోవైపు, ఈ నెల నుంచే పప్పులు, పిండి పదార్థాలు, చీజ్​, బటర్​, చాక్లెట్లు, ఫోన్లు, ఫ్యాన్లు, టీవీలు, యాపిల్స్, సంత్రలు, ద్రాక్షలు, బీర్లు, వైన్స్​, పురుగుమందుల వంటి 600 వస్తువుల దిగుమతులపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన దేశంలో ఖర్చులను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బెడిసికొట్టింది. 
 
ప్రతి నెలా 10 కోట్ల డాలర్ల విలువైన పప్పులు, చక్కెర, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, మసాలా దినుసులు, వంట నూనెల వంటి ప్రధాన ఆహార పదార్థాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే శ్రీలంక వంటి దేశానికి.. నిషేధం రోకలిపోటులా తయారైంది. ఇటు కరోనా కారణంగా రవాణా సౌకర్యాలూ ఇంకా మెరుగుపడకపోవడంతో.. స్థానికంగా ఫుడ్​ సప్లై చెయిన్​కు బ్రేకులు పడ్డాయి. దీంతో ఫుడ్​ ఐటెమ్స్​కు కొరత ఏర్పడింది. 
 
జనాలు షాపుల వద్ద సరుకుల కోసం క్యూలు కడుతున్నారు. గత నెల వరకు కిలో రూ.120 ఉన్న చక్కెర.. ఇప్పుడు ఏకంగా రూ.192కు పెరిగింది. కొన్ని చోట్లయితే రూ.230దాకా పలుకుతోంది. కిలో కందిపప్పు ఇదివరకు రూ.167 ఉండగా.. ఇప్పుడు రూ.310 అయింది. పాలపొడి ధర కూడా రెట్టింపైంది. కొరత ఏర్పడడంతో ఒక్కొక్కరికి 400 గ్రాములకు మించి ఇవ్వట్లేదు. దీంతో వృద్ధులు, పిల్లలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడుపునొప్పి తగ్గిస్తానని బొడ్డుచుట్టూ కొరికిన భూత వైద్యుడు...