పాకిస్థాన్ మరోమారు తన వక్రబుద్ధిని చూపించింది. దీంతో భారత మహిళ సరైన గుణపాఠం చెప్పారు. కర్రుకాల్చి వాతపెట్టినట్టుగా కౌంటరిచ్చారు. పాక్ అవలంభిస్తున్న విధానాల వల్లే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని ప్రపంచాన్ని ఎలుగెత్తి చాటారు. దీంతో అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ పరువు మరోమారు పోయింది.
న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో కాశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ లేవనెత్తారు. దీనికి భారత్ ధీటుగా కౌంటరిచ్చింది. పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు యూఎన్‌లోని భారత ప్రతినిధి, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిణి స్నేహ దూబే తీవ్రంగా ఖండించారు.
జమ్మూకాశ్మీర్, లడఖ్‌లు ఎప్పటికీ భారత్‌లోనే భాగమని ఆమె స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్, లడాఖ్‌లను భారత్ నుంచి ఎవరూ వేరు చేయలేరని, అవి తమ దేశంలో అతర్భాగమని తెల్చిచెప్పారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ అడ్డాగా మారుతోందని ఆరోపించారు. ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తోందని మండిపడ్డారు.
ఉగ్రవాదులకు మద్దతివ్వడం, సహకరించడం, ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ పాత్ర గురించి ఐరాసలో సభ్యదేశాలకు తెలుసు అని వ్యాఖ్యానించారు. బహిరంగంగా ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ, ఆర్థిక, ఆయుధాలు సమకూర్చడమనేది ప్రభుత్వ విధానంగా పెట్టుకున్న ఏకైక దేశం పాక్ అనేది ప్రపంచం గుర్తించిందని చెప్పారు.
అంతర్జాతీయ కరుడుగట్టిన ఉగ్రవాదిగా పేరుగాంచిన ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్థానే ఆశ్రయం ఇచ్చిందనే విషయాన్ని ఏ ఒక్కరూ విస్మరించజాలరన్నారు. పాక్ అవలంభిస్తున్న విధానాల వల్లే ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారంటూ పాక్ తీర్పును ఐరాస వేదికగా తూర్పారబట్టారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఖంగుతిన్నారు.