అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం రాత్రి తాలిబన్లు మూడు రాకెట్లు ప్రయోగించారని అధికారులు తెలిపారు. రెండు రాకెట్లు రన్‌వే తాకడంతో విమానాల రాకపోకలను రద్దు చేశామని చెప్పారు.
రన్‌వే మరమ్మతు పనులు జరుగుతున్నాయని, ఆదివారం సాయంత్రం నుండి సేవలను అందుబాటులోకి తెస్తామని ఎయిర్‌పోర్ట చీఫ్ మసూద్ పష్టున్ తెలిపారు. అమెరికా, నాటో బలగాల నిష్క్రమణ తర్వాత ఆఫ్గాన్‌లో తాలిబన్లు పలు ప్రాంతాలను తమ చేతులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే 80 శాతం భూభాగం వారు ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్ సైన్యం, తాలిబన్ల మధ్య భీకర పోరు జరుగుతోంది. కాబుల్‌లోని సివిల్ ఏవియేషన్ అధికారి ఈ రాకెట్ దాడిని ధ్రువీకరించారు. కావాల్సిన లాజిస్టిక్, వాయుసేన సహకారం ఇక్కడి నుంచే కొనసాగుతోన్న నేపథ్యంలోనే తాలిబన్లు విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
మరో రెండు రాష్ట్రాల రాజధానులైన హెరాత్, లష్కర్ ఘాను సైతం సొంతం చేసుకునేందుకు తాలిబన్లు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఈ నగరాల సరిహద్దులకు చేరారు.