ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ నిధుల మళ్లింపుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు.
నిధుల మళ్లింపు పథకంతో బీసీలకు నయవంచన చేస్తోందని, బీసీలను ఉద్దరించేశామంటూ మోసం, దగా చేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్లలో బీసీ కార్పొరేషన్ల నుంచి రూ.18,050 కోట్లు మళ్లించారన్నారు. బీసీల నిధుల మళ్లింపు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
అంతేకాకుండా, 2019-20లో రూ.15 వేల కోట్లు కేటాయించి రూ.10,478 కోట్లు మళ్లించారని, 2020-21లో రూ.23 వేల కోట్లు, 2021-22లో రూ.25 వేల కోట్లు మళ్లించారని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. బీసీ కార్పొరషన్ నుంచి రెండేళ్లలో ఒక్క రుణమూ ఇవ్వకపోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
45 వేల కాపు కార్పొరేషన్ రుణాలు రద్దు చేయడం వాస్తవం కాదా అని నిలదీశారు. కార్పొరేషన్, ఫెడరేషన్, సబ్ ప్లాన్‌లను నిర్వీర్యం చేశారని విమర్శించారు. టీడీపీ హాయంలో బీసీలను యజమానులుగా చేస్తే.. ఇప్పడు సీఎం జగన్ బిచ్చగాళ్లుగా మార్చారని అనగాని సత్యప్రసాద్ ఆ లేఖలో పేర్కొన్నారు.